అమెరికాలో నాట్స్ సంబరం..వెల్లివిరియనున్న తెలుగు పరిమళం-TNI ప్రత్యేకం

Featured Image

జూలై 4,5,6 తేదీల్లో అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టాంపాలో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(NATS) 8వ ద్వైవార్షిక తెలుగు మహాసభలు "అమెరికా తెలుగు సంబరాల" పేరిట ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికాలో మునుపెన్నడూ లేని విధంగా తెలుగు పరిమళాలను వెదజల్లుతూ.. ఆధ్యాత్మిక, సాహితీ, కళ, సినిమా, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులతో ఈ సభలు ఉత్సాహంగా సాగనున్నాయని నాట్స్ 2025 సభల కన్వీనర్ గుత్తికొండ శ్రీనివాస్, నాట్స్ బోర్డు ఛైర్మన్ పిన్నమనేని ప్రశాంత్, అధ్యక్షుడు మదన్ పాములపాటి, తదుపరి అధ్యక్షుడు మందాడి శ్రీహరిలు తెలిపారు. ఈ వేడుకల్లో దేవిశ్రీప్రసాద్, థమన్‌ల సంగీత విభావరి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రెండు రోజుల పాటు ఇరువురు తమ సంగీత లాహిరిలో అతిథులను అలరిస్తారని వీరు తెలిపారు.

హిల్స్‌బరో నది ఒడ్డున డౌన్‌టౌన్ అందాల నడుమ ఉన్న టాంపా కన్వెన్షన్ సెంటరు ఈ సంబరాలకు ఆతిథ్యం ఇవ్వనుంది. సంబరాల్లో తెలుగుదనానికి పెద్దపీట వేస్తూ అమెరికావ్యాప్తంగా కథలు, కవితలు, పద్యాల పోటీలను నిర్వహిస్తున్నారు. వీటితో పాటు క్రీడా, సాంస్కృతిక పోటీలను సైతం నిర్వహిస్తున్నట్లు సంబరాల కార్యవర్గం వెల్లడించింది. విజేతలకు నాట్స్ సంబరాల ప్రధాన వేదికపై బహుమతులను అందజేస్తామని తెలిపారు.

రామ్మోహన్‌నాయుడు, డా. పెమ్మసాని చంద్రశేఖర్, దగ్గుబాటి పురందేశ్వరి, అయ్యన్నపాత్రుడు, వంగలపూడి అనిత, కె.వి.రావు, డా. కాసు ప్రసాదరెడ్డి, డా. ఎ.వి.గురవారెడ్డి, రాఘవేంద్రరావు, వెంకటేష్, సాయికుమార్, సుకుమార్, హరీష్ శంకర్, కనకాల సుమ, జయసుధ, మీనా, ఆమని, కావ్య థాపర్, నభా నటేష్, పూర్ణ, తనికెళ్ల భరణి, బీ.ఆర్.నాయుడు, చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, హైపర్ ఆది తదితరులతో కూడిన అతిథుల బృందం ఈ సంబరాల్లో సందడి చేస్తారని నిర్వాహక కార్యవర్గం తెలిపింది.

"ఇది మన తెలుగు సంబరం - జరుపుకుందాం కలిసి అందరం" అనే నినాదంతో నిర్వహించనున్న ఈ అమెరికా తెలుగు సంబరాల్లో ప్రవాసులు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని శ్రీనివాస్, ప్రశాంత్, మదన్‌లు కోరారు. రిజిస్ట్రేషన్ కొరకు ఈ వెబ్‌సైట్ సందర్శించవచ్చు - https://sambaralu.org/ .

Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - https://sambaralu.org/

Tags-NATS 8th America Telugu Sambaralu Tampa Florida USA Guests

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles