రాష్ట్రేతర ఆంధ్రులు తెలుగు చదవటం రాయటం నేర్చుకోవాలి - మండలి బుద్ధప్రసాద్

Featured Image

జనగణనలో తెలుగు భాషీయులగా నమోదు చేసుకుని తిరిగి దేశంలో రెండవ స్థానానికి తెలుగు చేరేలా రాష్ట్రేతర ఆంధ్రులు కృషి చేయాలని ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షులు, అవనిగడ్డ ఎమ్మెల్యే డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. రాష్ట్రేతర ఆంధ్రులు తాము స్థిరపడిన ప్రాంతాల భాషా సంస్కృతులను నేర్చుకుంటూనే తమ మాతృభాషను కొనసాగించాలని తహతహలాడుతున్నారని తెలిపారు. వారిలో చాలా మంది తెలుగును మాట్లాడతారు కానీ వ్రాయటం, చదవటం రాదన్నారు. వారు దీన్ని అధిగమించి తెలుగును అభ్యసించాలని సూచించారు. శుక్రవారం సాయంత్రం కేరళ రాష్ట్రం ఎర్నాకులం కడవంత్రలో ఉన్న గిరినగర్ కమ్యూనిటీ హాలులో జాతీయ సదస్సు జరిగింది. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య, ఆంధ్ర సాంస్కృతిక సంఘం - కొచ్చిన్ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రేతర తెలుగు సంఘం పదవ వార్షికోత్సవం సందర్భంగా జాతీయ సదస్సు నిర్వహించారు. ఏపీ నాటక అకాడమీ అధ్యక్షుడు గుమ్మడి గోపాలకృష్ణ కూడా పాల్గొన్నారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన మండలి బుద్ధప్రసాద్ ప్రసంగిస్తూ ఆధునిక కాలంలో వృత్తి, వ్యాపార రీత్యా వలసలతో ఇతర రాష్ట్రాల్లో స్థిరపడిన తెలుగు వారి సంఖ్య దాదాపు ఉమ్మడి తెలుగు రాష్ట్ర జనాభాకు సమానంగా ఉంటుందన్నారు. ఇతర రాష్ట్రాలలో నివసిస్తున్న తెలుగు వారి మాతృ భాషా సంస్కృతులను పరిరక్షించటానికి 2015లో ఏర్పడిన రాష్ట్రేతర తెలుగు సమాఖ్య దేశ వ్యాప్తంగా సభ్యులు కలిగి వివిధ ప్రాంతాలలో క్రియాశీలకంగా ఉన్న తెలుగు సంస్థలు రాష్ట్రేతర తెలుగు సమాఖ్యకు అనుబంధంగా ఇతర తెలుగు సంస్థల సమన్వయంతో తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.

తెలుగు భాషాభివృద్ధికి ప్రభుత్వాలు, అనేక తెలుగు సంస్థలు కృషి చేస్తున్నాయన్నారు. కానీ సుదూర ప్రాంతాలు కావటం, కొన్నిచోట్ల స్థానిక భాషల ఆధిపత్య ధోరణులతో తెలుగు నేర్చుకోవటం కుంటుపడిందన్నారు. ఈ సందర్భంలో రాష్ట్రేతర తెలుగు భాషా సంస్థలు తెలుగు భాషా నిష్ణాతులతో చర్చించి దేశవ్యాప్తంగా రాష్ట్రేతర ప్రాంతాల్లో తెలుగు నేర్పించాల్సిన అవసరాన్ని గుర్తించినట్లు తెలిపారు.

తదనుగుణంగా ఇతర రాష్ట్రాలలోని తెలుగు అధ్యాపకులతో ఒక కమిటీ ఏర్పరిచి వారి సూచనలతో ఆచార్య డి.మునిరత్నం నాయుడు నేతృత్వంలో ఐదుగురు నిష్ణాతులైన సభ్యులతో పాఠ్య పుస్తక కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలుగు బోధనకు అవసరమైన పాఠ్య ప్రణాళికను రూపొందించి మొదటి తరగతికి తెలుగు, ఆంగ్ల, హిందీ భాషల అక్షరాల ద్వారా తెలుగు భాషను తేలికగా అభ్యసించే విధంగా ప్రత్యేక పుస్తకం తయారు చేసినట్లు తెలిపారు. ఈ పుస్తకం ఆన్లైన్లో అభ్యసించే వారికీ, ప్రత్యక్ష బోధనకు కూడా ఉపయోగపడుతుందన్నారు.

రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ద్వారా ప్రారంభించబోయే తెలుగు బోధనకు సంబంధించిన కోర్సుకు ప్రభుత్వ సంస్థల గుర్తింపు కోసం ప్రయత్నం జరుగుతోందని వివరించారు. తెలుగు వెలుగు వాచక పుస్తకం తయారీలో సహకరించిన అధ్యాపకులందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రేతర ఆంధ్రుల పిల్లలకు ఈ పుస్తకం ద్వారా తెలుగు నేర్పించే ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. తెలుగు భాష నేర్పించడమే కాకుండా వారికి సర్టిఫికెట్లు ఇస్తే మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందన్నారు. పార్లమెంటు సభ్యులు గోపీనాధ్ మాట్లాడుతూ తమిళనాడులో తమిళాన్ని నిర్బందంగా నేర్పిన విధంగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగుని నేర్పించకపోతే భాష మనుగడ ప్రశ్నార్దకమవుతుందని అన్నారు. జనగణనలో తెలుగు మాతృభాషగా నమోదు చేయాలని పిలుపునిచ్చారు.

డాక్టర్ మునిరత్నం నాయుడు మాట్లాడుతూ రాష్ట్రేతర ఆంధ్రులు ప్రతి ఒక్కరూ భాషా సైనికులుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జరిగిన సాహిత్య గోష్టికి ముఖ్య అతిధిగా హైదరాబాద్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య డాక్టర్ వెలుదండ నిత్యానందరావు, సమన్వయకర్తగా డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి వ్యవహరించారు. సాయంత్రం దశమ వార్షికోత్సవ శుభారంభం సందర్భంగా జ్యోతుల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జాతీయ సదస్సు ప్రారంభ సభకు కొచ్చిన్ ఆంధ్ర సాంస్కృతిక సంఘం అధ్యక్షులు ఎం.హరి హర నాయుడు స్వాగతం పలికారు. రాష్ట్రేతర తెలుగు సంఘం అధ్యక్షులు రాళ్లపల్లి సుందర రావు అధ్యక్ష ఉపన్యాసం చేశారు. రాష్ట్రేతర తెలుగు సంఘం కార్యదర్శి పీవీపీసీ ప్రసాద్ వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రేతర తెలుగు సంఘం ప్రచురించిన 'తెలుగు వెలుగు' వాచకాన్ని మండలి బుద్ధప్రసాద్ ఆవిష్కరించారు.

Get ready for long weekend...register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-RATESA 10th Anniversary In Cochin - Mandali Gummadi Attends

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles