🕑 Published: November 22, 2026 at 08:53 AM CST
గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో డిసెంబరు 20వ తేదీ ఆదివారం ఉదయం 10.30 గంటలకు ‘ఆధునిక ప్రపంచంలో రాజకీయ వ్యవస్థలు’ అనే అంశంపై ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నారు. ప్రజాస్వామ్యం, కమ్యూనిజం, నియంతృత్వం, రాచరికం, దైవపాలన వంటి రాజకీయ వ్యవస్థలు సమకాలీన ప్రపంచ పరిపాలనలో పోషిస్తున్న పాత్రపై ఈ కార్యక్రమంలో చర్చించనున్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య, విశాఖపట్నం ఎంపీ మతుకుమిల్లి శ్రీభరత్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి విశిష్ట అతిథులుగా హాజరుకానున్నారు.
సదస్సులో భాగంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ‘అంతర్వీక్షణం’ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. సామాజిక మాధ్యమాల్లో రచించి, వివిధ వార్తాపత్రికల్లో ప్రచురితమైన వ్యాసాల సంకలనంగా ఈ పుస్తకాన్ని రూపొందించారు. సీనియర్ జర్నలిస్టు సందిరెడ్డి కొండలరావు ఈ పుస్తకాన్ని సంకలనం చేశారు. సదస్సు అనంతరం రాజకీయ, సామాజిక అంశాలపై ముఖాముఖి ప్రశ్నోత్తర కార్యక్రమం నిర్వహించనున్నారు. రాజకీయ వ్యవస్థల పరిణామం, ప్రస్తుత ప్రపంచంలో వాటి పాత్రపై ప్రముఖుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం వేదిక కానుంది.
