🕑 Published: November 13, 2026 at 04:43 PM CST
తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా (తాకా) ఆధ్వర్యంలో నిర్వహించిన దీపావళి వేడుకలు గత శనివారం నాడు వైభవంగా నిర్వహించారు. మిస్సిసాగాలోని మైఖేల్ పవర్ సెయింట్ జోసెఫ్ హైస్కూల్‌లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, సంగీతం, నృత్యాలతో కూడిన ఈ వేడుకలు ఉత్సాహాన్ని నింపాయి. టొరంటో ప్రాంతంలోని తెలుగు కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వినోదభరితమైన ప్రత్యేక ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. తాకా అధ్యక్షుడు ప్రసన్న తిరుచిరాపల్లి అతిథులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. విదేశాల్లో నివసిస్తున్నప్పటికీ తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను పరిరక్షిస్తూ, వాటిని భావితరాలకు అందించడం తాకా ప్రధాన లక్ష్యాల్లో ఒకటని వెల్లడించారు.
ఉపాధ్యక్షురాలు వాణి జయంతి, ప్రధాన కార్యదర్శి మల్లిక్ చారి, కోశాధికారి ప్రదీప్ రెడ్డి, డైరెక్టర్లు అశ్విత, ప్రశాంతి, యశ్వంత్, కళ్యాణ్ సమన్వయపరిచారు. తాకా వ్యవస్థాపక అధ్యక్షుడు చారి సామంతపూడి, ట్రస్టీ ఛైర్ కల్పన మోటూరి, ట్రస్టీలు అనిత సజ్జ, ప్రవీణ్ పెనుబాక, పవన్ కుమార్ బసాని, ఆదిత్య వర్మ, మాజీ అధ్యక్షులు, వ్యవస్థాపక సభ్యులు రమేష్ మునుకుంట్ల, వ్యవస్థాపక సభ్యులు అరుణ్ కుమార్ లయం, ప్రత్యేక కార్యక్రమాల కమిటీ సభ్యురాలు శ్రుతి ఏలూరి తదితరులు పాల్గొని సహకరించారు. ప్రవీణ్ చీమట, డా. గౌతమ్ కొల్లూరిల సహకారాన్ని గుర్తించి సత్కరించారు. తాకా నిర్వహిస్తున్న సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు.



