🕑 Published: November 10, 2026 at 11:01 AM CST
లండన్‌లోని బరో ఆఫ్ సటన్ కౌన్సిలర్‌గా ఆలపాటి చంద్ర లిబరల్ డెమోక్రటిక్ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. స్థానికంగా తెలుగు వ్యక్తి ఈ ఘనత సాధించడంతో తెలుగు సమాజం హర్షం వ్యక్తం చేస్తూ ఆయనకు అభినందనలు తెలిపింది. ఎన్నికైన వెంటనే స్థానిక ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి నిధుల సేకరణ కోసం చంద్ర 38 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. సుమారు ఏడు గంటల పాటు సాగిన ఈ యాత్ర ద్వారా విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తన వంతు కృషి చేశారు.
చంద్ర చేపట్టిన పాదయాత్రకు స్థానిక పార్లమెంట్ సభ్యుడు, సటన్ మేయర్, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా తెలుగు సంఘం నాయకుడు భాస్కరరావు అమ్మినేని మాట్లాడుతూ, పిల్లల భవిష్యత్తు, స్థానిక విద్యావ్యవస్థ అభివృద్ధి పట్ల చంద్రకు ఉన్న నిబద్ధతకు ఈ పాదయాత్ర నిదర్శనమని పేర్కొన్నారు. సమాజ సేవ, విద్యాభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు.
