🕑 Published: October 28, 2026 at 05:21 PM CST
అమెరికాలోని మిచిగన్ రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు వెల్లివిరిశాయి. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ) డెట్రాయిట్ చాప్టర్ ఆధ్వర్యంలో నాలుగోసారి నిర్వహించిన బతుకమ్మ, దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. స్టూడియో సెంటర్‌లో నిర్వహించిన ఈ వేడుకల్లో సుమారు 1,800 మంది తెలుగు ప్రవాసులు పాల్గొన్నారు. భక్తి, సంప్రదాయం, సాంస్కృతిక ఐక్యతకు ఈ వేడుకలు ప్రతీకగా నిలిచాయి.
బతుకమ్మ పండుగ భిన్న ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే సాంస్కృతిక వారధి అని నిర్వాహకులు పేర్కొన్నారు. బతుకమ్మ పాటలు, ఆటలతో అందరూ ఒకే లయలో మమేకమవుతూ తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పారని తెలిపారు. మహిళలు, యువతులు పట్టుచీరలు, సంప్రదాయ లంగా వోణీలు ధరించి వేడుకలకు హాజరయ్యారు. పాల్గొన్నవారు తీసుకొచ్చిన వందల రంగురంగుల పూల బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గౌరీదేవికి, ప్రకృతి మాతకు సమర్పణగా పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ మహిళలు తిరుగుతూ సంప్రదాయ పాటలు పాడి నృత్యాలు చేశారు. సమన్వయంతో సాగిన చప్పట్లు, అడుగులు, పాటలతో ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొంది. స్థానిక ఆలయ అర్చకుడి ఆధ్వర్యంలో సంప్రదాయ శమీ పూజ నిర్వహించడంతో వేడుకలు ఆధ్యాత్మికంగా ప్రారంభమయ్యాయి.
వేడుకలకు హాజరైన వారందరికీ స్థానిక భారతీయ రెస్టారెంట్, తవా ప్రత్యేకంగా సిద్ధం చేసిన విందును అందించారు. వివిధ భారతీయ సంఘాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మిచిగన్ రిపబ్లికన్ పార్టీ కో-చైర్, వేయిన్ స్టేట్ బోర్డ్ గవర్నర్ కూడా అయిన, సన్నీ రెడ్డి హాజరయ్యారు. వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యం ప్రవాస భారతీయుల మధ్య ఐక్యత, పరస్పర సహకారానికి నిదర్శనంగా నిలిచింది. జీటీఏ జాతీయ ఛైర్మన్ ప్రవీణ్ కేశిరెడ్డి నాయకత్వంలో, డెట్రాయిట్ చాప్టర్ అధ్యక్షుడు వెంకట్ వడ్నాల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు మల్లికార్జున్ పడుకునే, మహేశ్ వెణుకదాసుల, ప్రేమ్ రెడ్డి చింతపల్లి, సుమ కల్వాల, జీటీఏ మహిళా విభాగానికి చెందిన సుష్మ పడుకునే, స్వప్న చింతపల్లి, దీప్తి చిత్రపు కార్యక్రమాల సమన్వయంలో కీలక పాత్ర పోషించారు. వాలంటీర్ల సహకారంతో వేడుకలను విజయవంతంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఉత్తమ బతుకమ్మ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. వర్కింగ్ కమిటీ, స్థానిక కార్యవర్గ సభ్యులు సత్యధీర్ గంగసాని, నవదీప్ వేంపటి, రవి పిన్నపురెడ్డి, యుగంధర్ భూమిరెడ్డి, కరుణాకర్ కందుకూరి పాల్గొన్నారు. ఎగ్జిక్యూటివ్, అడ్వైజరీ సభ్యులు యాదగిరి ఇలేని, సాయినాథ్ లచ్చిరెడ్డిగారి, గోవర్ధన్ పిన్నంరెడ్డి, కృష్ణ ప్రసాద్ జలిగామ, అశోక్ వెలుదండి, బద్రీనారాయణ, రాహుల్ తోట, భాస్కర్ సిరికి, రామ్ పొన్నూరు, వెంకటరమణ కొత్త, కమల్ పిన్నపురెడ్డి, సంతోష్ కోట, వెంకటేశ్ మంచాల, సతీష్ ముప్పిడి తదితరులు బహుమతుల ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.




