అమెరికాలో "అంబికా" విస్తరణ

Featured Image

'భగవంతునికి భక్తునికి అనుసంధామైనది ', 'అమ్మను మర్చిపోలేము-అంబికను మరిచిపోలేము ' వంటి వినూత్న ప్రచార శీర్షికలతో తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశవ్యాప్తంగా పేరుగడించిన అంబికా దర్బార్ బత్తి వ్యాపారాన్ని అమెరికాలో కూడా విస్తరించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు అంబికా కృష్ణ తెలిపారు. బుధవారం సాయంత్రం డల్లాస్‌లో ఆయనతో ఆత్మీయ సమావేశాన్ని డా.తోటకూర ప్రసాద్ సమన్వయంలో ఏర్పాటు చేశారు. 1946లో తన తండ్రి ఆలపాటి రామచంద్రరావు ప్రారంభించిన సంస్థలో 1968లో జేరిన తాను అంచలంచెలుగా సంస్థను బలోపేతం చేసిన తీరు, వ్యాపార-సినిమా-రాజకీయ రంగాల్లో తన అనుభవాలను, జీవితపాఠాలను సభికులతో ఆయన సరదాగా పంచుకున్నారు.

తన వెంట పడిన రాజకీయ అవకాశాలు విజయాన్ని అందించగా, తాను వెంట పడిన రాజకీయ అవకాశాలు ఓటమి పాఠాలు నేర్పాయని, నమ్మకమే అమ్మకమని తన తండ్రి చెప్పిన వ్యాపారసూత్రాన్ని పాటించి తాను ఈ స్థితికి చేరుకున్నానని వ్యాఖ్యానించారు. నిర్మాతగా తాను తీసిన 10 సినిమాల్లో 7 సరిగ్గా ఆడకపోయినా అనుభవాలు, మిత్రులు, పరిచయాలు పెరిగాయని అంబికా కృష్ణ ఆశావహంగా ప్రసంగించారు. బాలకృష్ణ తాను మంచి మిత్రులమని, ప్రతిరోజు మాట్లాడుకోకుండా ఉండలేమని ఆయన వెల్లడించారు. ఏలూరులో సంగీత-సాహిత్య-కళా రంగాలకు తాము సేవ చేస్తున్నామని, 2500 మంది ఉద్యోగులతో తమ సంస్థ అంబిక ఆశీర్వాద బలంతో దూసుకెళ్తోందని అన్నారు. 120కు పైగా వ్యాపార ఉత్పత్తులే గాక హోటల్ రంగంలో కూడా తాము ప్రవేశించామని కృష్ణ తెలిపారు.

ఇప్పటికీ తమది ఉమ్మడి కుటుంబమన్న అంబికా కృష్ణ ఆ సాంప్రదాయాన్ని కొనసాగించడం వెనుక అహంకారానికి, అవసరాలను అర్థంచేసుకునే మనోస్థితికి మధ్య సమన్వయమే కారణమని పేర్కొన్నారు. తమ కుటుంబసభ్యులు ఎల్లప్పుడూ నవ్వుతుండటం వెనుక అమ్మవారి కృప ఉందని వెల్లడించారు. 30దేశాల్లో తిరిగినా అమెరికా అంటే అదొక అనుభూతి అని ఇక్కడి మిత్రులను కలవడం ఆనందంగా ఉంటుందన్నారు.

కార్యక్రమాన్ని తోటకూర ప్రసాద్ ఏలూరు ప్రాంత చరిత్రపై కూలంకుష ప్రసంగంతో ప్రారంభించారు. ఆ ప్రాంతం నుండి సామాజిక-సాంఘిక-రాజకీయ-సినిమా-వ్యాపార-కళా రంగాల్లో విజయ తీరాలు అందుకున్నవారిని స్మరించుకున్నారు. కళారత్న కె.వి.సత్యనారాయణ అంబికా కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం అంబికా కృష్ణను సత్కరించారు. డా. ఆళ్ల శ్రీనివాసరెడ్డి, డా. కొర్సపాటి శ్రీధర్‌రెడ్డి, డా. అడుసుమిల్లి రాజేష్, డా.యు.నరసింహారెడ్డి, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, వెన్నం మురళి, అనంత్ మల్లవరపు, బాపు నూతి, అజయ్ రెడ్డి, చినసత్యం వీర్నపు, మాడ దయాకర్, చంద్రహాస్ మద్దుకూరి, పొనంగి గోపాల్, కోయ లక్ష్మినారాయణ, కాకరాల విజయమోహన్ , విజయ్ కొండా తదితరులు పాల్గొన్నారు.

Tags-Ambica Durbar Batti To Expand Market In USA Says Ambica Krishna In Dallas

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles