🕑 Published: July 23, 2026 at 01:34 PM CST
అమెరికన్ లీజియన్ బాయ్స్ నేషన్ ఉపాధ్యక్షుడిగా తెలుగు మూలాలు ఉన్న యువకుడు క్రిష్ కొర్రపాటి ఎన్నికయ్యాడు. అమెరికావ్యాప్తంగా ఉన్న సుమారు 20వేల మంది హైస్కూల్ విద్యార్థుల నుండి అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కేవలం 100 మందిని రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల ద్వారా ఎంపిక చేసి జాతీయ స్థాయి పోటీకి ఎంపిక చేస్తారు. వీరందరూ వాషింగ్టన్ డీసీలో జరిగే జాతీయ స్థాయి పోటీలో నేషనలిస్ట్స్, ఫెడరలిస్ట్స్ అనే రెండు పార్టీలుగా విడిపోయి తమ ప్రచార, ప్రసంగ, రాయబార, నాయకత్వ ప్రతిభను ప్రదర్శిస్తారు. వారంరోజుల పాటు అమెరికా సెనెట్ తరహాలో మాక్ సమావేశాలు నిర్వహించి, చట్టాల రూపకల్పన, రాజకీయ చర్చల్లో పాల్గొంటారు. ఈ క్రమంలో తోటి సెనేటర్ల మద్దతును కూడగట్టి నార్త్ కరొలినా తరఫున ప్రాతినిథ్యం వహించిన క్రిష్ కొర్రపాటి ఈ పోటీలో గెలుపొంది బాయ్స్ నేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆయనతో పాటు ఆర్కాన్సాకు చెందిన సాయర్ రే అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. బాయ్స్ నేషన్ సంస్థ ప్రతినిధులు అమెరికా ప్రభుత్వ విభాగాలతో చురుగ్గా కలిసి పనిచేస్తూ అనుభవాన్ని గడిస్తారు.
అమెరికాలో స్థిరపడిన గుంటూరు జిల్లా పల్లపాడు గ్రామానికి చెందిన నాట్స్ సంస్థ మాజీ ఛైర్మన్ డాక్టర్ మధు కొర్రపాటి-శిరీష, డాక్టర్ వినీత్ కొర్రపాటి-స్మితల కుటుంబం నుంచి వచ్చిన క్రిష్ కొర్రపాటి ఈ విజయం సాధించడం పట్ల ప్రవాసులు అభినందనలు తెలిపారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ప్రఖ్యాత వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌లు కూడా బాయ్స్ నేషన్ సంస్థ నుండి ఎదిగినవారే!
