🕑 Published: July 26, 2026 at 10:47 AM CST
శనివారం నాడు మిషిగన్ రాష్ట్రం డెట్రాయిట్ పరిసర ప్రాంతమైన నోవైలోని శ్రీ వెంకటేశ్వర ఆలయ సాంస్కృతిక కేంద్రంలో "కళారత్న" కె.వి.సత్యనారాయణ నృత్య దర్శకత్వం వహించి సమర్పించిన "శ్రీ విష్ణు కళ్యాణం" నృత్యరూపకం అలరించింది. డెట్రాయిట్ తెలుగు సంఘం-తానా సంస్థల సమ్యుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రదర్శనలో సత్యనారాయణ రచించిన రుక్మిణి కళ్యాణం, శ్రీ వెంకటేశ్వర కళ్యాణం, డాక్టర్.రాళ్ళబండి కవితాప్రసాద్ రచించిన గోదా కళ్యాణంలోని ముఖ్యఘట్టాలను ఏర్పాటు చేశారు. 47మంది స్థానిక నాట్యగురువులు, నాట్యకళాకారులతో ఈ నృత్యరూపకాన్ని ప్రదర్శించారు. ప్రదర్శన అనంతరం సత్యనారాయణను సత్కరించారు.
ఆలయ ఛైర్మన్ రవి గుళ్లపల్లి, కల్చరల్ ఛైర్మన్ జోగేశ్వరరావు పెద్దిబోయిన, BOT వేణు సూరపరాజు, తానా నుండి కిరణ్ దుగ్గిరాల, నీలిమ మన్నె, డెట్రాయిట్ తెలుగు సంఘం నుండి అధ్యక్షురాలు సుబ్రత గడ్డం, కల్చరల్ ఛైర్ అర్చన, కార్యక్రమాల సమన్వయకర్త ఉదయకుమార్ చాపలమడుగు, వెంకట్ యెక్క తదితరులు పాల్గొన్నారు.

