🕑 Published: October 23, 2026 at 04:23 PM CST
విశ్వహిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు, పద్మభూషణ్-పద్మశ్రీ పురస్కారాల గ్రహీత, రాజ్యసభ మాజీ సభ్యుడు డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ షాంఘైలో 24,25 తేదీల్లో జరగనున్న 10వ అంతర్జాతీయ తెలుగు సదస్సుకు అతిథిగా హాజరవుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన హాంగ్‌కాంగ్‌ను సందర్శించి అక్కడి ప్రవాస తెలుగువారితో సమావేశమయ్యారు. ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆయనతో "ఆత్మీయ సమ్మేళనం"ను నిర్వహించింది. తన రచనా ప్రస్థానం, అనువాద అనుభవాలు, సాహిత్య ప్రయాణంలోని విశేషాలను హాస్యరసంతో మేళవించి పంచుకున్నారు. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి కుటుంబ నేపథ్యం కంటే కృషి, ప్రతిభ, పట్టుదల ముఖ్యమని సందేశం అందించారు.
మాజీ ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు, నటుడు అక్కినేని నాగేశ్వరరావు, కవి హరివంశ్‌రాయ్ బచ్చన్ తదితర మహనీయులతో తన అనుభవాలను వివరించారు. భాషా వైవిధ్యం, జాతుల మధ్య భాషా సంబంధాలు, సామాజిక సంభాషణల్లో భాష పాత్ర, తన రచనల్లోని పాత్రల రూపకల్పన వంటి అంశాలపై ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అనంతరం హాంగ్ కాంగ్ మరియు మకావ భారత కాన్సుల్ జనరల్ రాజేష్ ఎన్.నాయక్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని హాంగ్ కాంగ్ లోని చారిత్రాత్మక హిందూ దేవాలయంలో డా. యార్లగడ్డను సత్కరించారు. ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు జయ పీసపాటి, రవి పీసపాటి, క్రీడా కార్యదర్శి హరిన్ చక్రవర్తి, ప్రముఖ శాస్త్రీయ నృత్యకారుడు సంజయ్ వడపల్లి, హిందూ అసోసియేషన్ అధ్యక్షుడు లాల్ హర్దసానీ, సభ్యులు కృపలానీ భగ్వాన్‌దాస్, ట్రస్టీ విశాల్ ఖురానా తదితరులు పాల్గొన్నారు.














