🕑 Published: October 24, 2026 at 10:18 AM CST
చెన్నైలోని శంకర నేత్రాలయ ప్రధాన ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో శంకరరత్న పురస్కారం–2025ను మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు చేతుల మీదుగా కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి, శోభా రెడ్డి దంపతులు అందుకున్నారు. నేత్ర వైద్య సేవలకు, సామాజిక కార్యక్రమాలకు వారు అందిస్తున్న సహకారాన్ని వెంకయ్యనాయుడు అభినందించారు. గతంలో రతన్ టాటా, జి. మాధవన్ నాయర్, ఏ.ఎం. నాయక్ వంటి ప్రముఖులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
ప్రసాద్ రెడ్డి దంపతులు వివిధ సేవా సంస్థలకు తమ లాభాల నుంచి ఏటా సుమారు 2 మిలియన్ డాలర్లు (రూ.20కోట్లు) విరాళంగా అందిస్తున్నారు. ఇప్పటివరకు శంకర నేత్రాలయకు 6.25 లక్షల డాలర్ల ఆర్థిక సహాయం చేయగా పురస్కార స్వీకరణ సందర్భంగా మరో లక్ష డాలర్లు విరాళంగా ప్రకటించారు. వారి సహకారంతో ఆధునిక సౌకర్యాలతో కూడిన మొబైల్ కంటి వైద్య యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే తొమ్మిది కంటి వైద్య శిబిరాలను నిర్వహించగా, మరిన్ని శిబిరాలను చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
కార్యక్రమంలో శంకర నేత్రాలయ అమెరికా విభాగ అధ్యక్షుడు బాలరెడ్డి ఇందుర్తి, సంస్థ ప్రతినిధులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. శంకర నేత్రాలయ ద్వారా అందుతున్న ఉచిత కంటి వైద్య సేవలు మరింత మందికి చేరేలా అమెరికాలో పలు రాష్ట్రాల్లో విభాగాలను ఏర్పాటు చేసి, దాతలు, స్వచ్ఛంద కార్యకర్తల భాగస్వామ్యాన్ని పెంచుతున్నట్లు బాలరెడ్డి ఇందుర్తి వివరించారు. నేత్ర వైద్య సేవలకు ప్రసాద్ రెడ్డి దంపతులు అందిస్తున్న సహకారం ఎంతో స్ఫూర్తిదాయకమని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

