🕑 Published: November 19, 2026 at 04:10 PM CST
కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీ వసుదైవ కుటుంబం(SVK) ఆధ్వర్యంలో ఐండ్హోవెన్లోని బాలాజీ ఆలయంలో శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. నెదర్లాండ్స్ నలుమూలల నుండి 1300 మంది భక్తులు పాల్గొన్నారు. వేదపండితుల ఆధ్వర్యంలో, సుప్రభాత సేవతో ప్రారంభమై, తోమాల సేవ, అర్చన జరిగాయి. అనంతరం సుందరంగా అలంకరించిన కళ్యాణ వేదికపై, వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాద్యాల మధ్య స్వామివారి కళ్యాణం, వస్త్ర సమర్పణ కన్నుల పండువగా జరిగాయి. తిరుమలలో జరిగే కళ్యాణోత్సవాన్ని తలపించింది.
నెదర్లాండ్స్‌లోని ప్రతి భారతీయ కుటుంబానికి స్వామివారి సేవ, దర్శనం అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో SVK పనిచేస్తోందని నిర్వాహకులు తెలిపారు. 2022లో మొదటి శ్రీ శ్రీనివాస కళ్యాణాన్ని ప్రారంభించి నిరాటంకంగా కొనసాగిస్తున్నారు. సనాతన ధర్మాన్ని ఐరోపాలో పరిరక్షిస్తూ, ముందుకు తీసుకువెళ్తున్నారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నెదర్లాండ్స్(TANE), Shrigandha, SAMUKA, EMM, HSS Netherlands వంటి ప్రవాస భారతీయ సంస్థలు సహకరిస్తున్నాయి. ఆలయ కార్యక్రమాలు, సేవల వివరాల కోసం: https://sribalajitemple-eu.org






