🕑 Published: May 01, 2026 at 12:26 PM CST
టెక్సాస్ అటార్నీ జనరల్ కెన్ ప్యాక్స్టన్ హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ దుర్వినియోగంపై జరుగుతున్న దర్యాప్తులో భాగంగా ఉత్తర టెక్సాస్‌కు చెందిన 30 కంపెనీలకు సివిల్ ఇన్వెస్టిగేటివ్ డిమాండ్స్ (CIDs) జారీ చేశారు. ఈ చర్యతో రాష్ట్రంలో వీసా మోసాలపై ప్రభుత్వం అవలంబిస్తున్న కఠిన వైఖరిని స్పష్టం చేస్తున్నారు. ఆయా సంస్థల్లో కొన్ని ప్రవాసాంధ్రులకు చెందినవి కూడా ఉండటం గమనార్హం. దర్యాప్తులో భాగంగా టెక్‌ప్రో ఐటీ, ఫేమ్ పీబీఎక్స్, 1స్ట్ ర్యాంకింగ్ టెక్నాలజీస్, క్యూబిట్జ్ టెక్ సిస్టమ్స్, బ్లూమింగ్ క్లౌడ్స్, విరాట్ సొల్యూషన్స్, ఓక్ టెక్నాలజీస్, టెక్‌పాత్, టెక్‌క్వెన్సీ వంటి సంస్థలు అనుమానిత జాబితాలో ఉన్నాయని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సంస్థలు హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌ను దుర్వినియోగం చేస్తూ తప్పుడు వ్యాపార కార్యకలాపాలు చూపించి విదేశీ ఉద్యోగులను స్పాన్సర్ చేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
కొన్ని సంస్థలు "ఘోస్ట్ ఆఫీసులు" కూడా నిర్వహిస్తున్నాయని అందుకే దర్యాప్తు చేస్తున్నట్లు అటార్నీ జనరల్ కార్యాలయం పేర్కొంది. వాస్తవంగా కార్యకలాపాలు లేకపోయినా, పనిచేస్తున్నట్లు చూపించి వీసా అనుమతులు పొందడం వంటి మోసపూరిత పద్ధతులు అనుసరించినట్లు అనుమానిస్తున్నారు. సంబంధిత కంపెనీల నుంచి ఉద్యోగుల వివరాలు, అందిస్తున్న సేవలు, ఆర్థిక లెక్కలు, సంస్థల అంతర్గత కమ్యూనికేషన్లు వంటి కీలక పత్రాలను సమర్పించాలని అటార్నీ జనరల్ కార్యాలయం ఆదేశించింది. "హెచ్-1బీ ప్రోగ్రామ్‌ను దుర్వినియోగం చేసి చట్టాన్ని అతిక్రమించే వారిని ఉపేక్షించేది లేదని కెన్ ప్యాక్స్టన్ పేర్కొన్నారు. టెక్సాస్‌లో పలు కంపెనీలపై ఈ తరహా దర్యాప్తు కొనసాగుతుండగా, తాజా చర్యలు ఆ ప్రక్రియలో భాగమేనని అధికారులు తెలిపారు. హెచ్-1బీ ప్రోగ్రామ్ అమెరికా పౌరుల ప్రయోజనాలకు అనుగుణంగా అమలవుతుందో లేదో నిర్ధారించేందుకు ఈ విచారణలు కొనసాగుతున్నాయి.
Texas Attorney General Official PR: - https://www.texasattorneygeneral.gov/news/releases/attorney-general-ken-paxton-takes-legal-action-part-investigation-nearly-30-north-texas-businesses
