🕑 Published: April 28, 2026 at 11:04 AM CST
ఐర్లాండ్ రాజధాని డబ్లిన్ నగరంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ వాసవి సమాఖ్య ఐర్లాండ్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాన్ని వైశాఖ శుద్ధ దశమి నాడు స్థానిక VHCCI ఆలయంలో ఏర్పాటు చేశారు. గణపతి ప్రార్థనతో వేడుక ప్రారంభించి, అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పుష్పాలతో అద్భుతంగా అలంకరించి పల్లకి సేవను ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం ప్రత్యేకంగా రాజోపచార సేవ అయిన ఛత్ర సహిత పల్లకి సేవ భక్తులను మైమరిపించింది. గోపూజను నిర్వహించారు.
పిల్లలకు మన సంస్కృతిని పరిచయం చేయాలనే ఉద్దేశంతో చిన్నారులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర వేషభూషణలతో పాటు అష్టలక్ష్మి స్వరూపాలలో దర్శనమిచ్చి, లక్ష్మి తత్వాన్ని వివరించారు. జ్యోతి గోస్వామి గారి నృత్య ప్రదర్శన, మహిళల భక్తి గానాలు, పిల్లలచే అన్నమాచార్య సంకీర్తనలు అలరించాయి. కన్యపూజ నిర్వహించారు. దుర్గాసహిత వాసవి అమ్మవారి కుంకుమార్చన పూజలో అతిథులు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అన్నప్రసాద వితరణ చేశారు. పినాక శర్మ వేదఆశీర్వచనాలు అందించారు.




