🕑 Published: April 27, 2026 at 11:31 AM CST
ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాం ప్రభుత్వానికి, ప్రవాసులకు మధ్య అమూల్యమైన వారధి అని ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డా. నోరి దత్తాత్రేయుడు అన్నారు. ఆదివారం నాడు ఫిలడెల్ఫియాలో నిర్వహించిన జయరాం అభినందన కార్యక్రమంలో డా. నోరి పాల్గొని ప్రసంగించారు. నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ తెలుగుజాతి ఔన్నత్యాన్ని అమెరికాలో జయరాం నిలబెట్టారని కొనియాడారు. ఎన్‌టీఆర్ అంటే తనకు అభిమానమని, ఆయన సతీమణి మేరకు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి బీజం పడి వారి కుటుంబంతో తనకు అనుబంధం పెరిగిందని వెల్లడించారు.
జయరాం మాట్లాడుతూ... ప్రవాసాంధ్రుల్లో నేను ఒకడిగా ఉన్నందుకే తనకు ఈ అవకాశం చంద్రబాబు కల్పించారని వెల్లడించారు. తనపై ప్రభుత్వం ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక విద్యను అందించడానికి ప్రవాసులు తోడ్పడాలని కోరారు. ఏపీకి గుగూల్ డేటా సెంటర్ రావడం ముదావహమన్నారు. మాజీ ఉప-రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణల వీడియో సందేశాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో పొట్లూరి రవి, మన్నవ సుబ్బారావు, భాను మాగులూరి, రాధాకృష్ణ మూల్పురి, రంజిత్ కోమటి, మురళి పమిడిముక్కల, ఫణి కంతేటి, శ్రీధర్ సాదినేని, నందగిరీష్ మూల్పూరి, నాగరాజు చింతం, సురేష్ యలమంచిలి, గోపి వాగ్వాల, హరనాథ్ బుంగతావుల, విశ్వనాథ్ కోగంటి, లావా ఐనంపూడి, గౌరి కొర్రోతు, సాయి బొల్లినేని, మధు ముప్పాల, శ్రీధర్ వీరమాచినేని, శ్రీహరి మందడి తదితరులు పాల్గొన్నారు.







