🕑 Published: April 21, 2026 at 11:00 AM CST
నెబ్రాస్కా రాష్ట్రంలోని ఒమాహా నగరంలో తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా (TSN) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఏప్రిల్ 25, 2026న వెస్ట్‌సైడ్ మిడిల్ స్కూల్‌లో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఆ సంస్థ అధ్యక్షుడు కొల్లి ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో 40కి పైగా బృందాలు సంగీతం, నృత్యం, సాంప్రదాయ కళారూపాలతో ఆకట్టుకోనున్నాయి. ఇటీవల నిర్వహించిన బ్యాడ్మింటన్, టెన్నిస్, బాస్కెట్‌బాల్, చెస్, పికిల్‌బాల్, క్యారమ్స్ పోటీల్లో పాల్గొన్న సుమారు 200 మందిలో విజేతలకు ఈ వేడుకల్లో బహుమతులు ప్రదానం చేయనున్నారు.
ఈసారి ప్రత్యేకంగా లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను ప్రవేశపెట్టారు. నాయకత్వం, కమ్యూనిటీ సేవల విభాగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి సత్కారం చేయనున్నారు. ప్రముఖ గాయకులు అంజనా సౌమ్య, తరుణ్ దోనిపాటి లైవ్ సంగీత కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించనుండగా, డెన్వర్‌కు చెందిన చుండ్రు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా ప్రసంగించనున్నారు. వివిధ వాణిజ్య స్టాళ్లు, భారతీయ వంటకాలతో సందర్శకులకు ప్రత్యేక అనుభవాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేశామని ఆయన వెల్లడించారు.
