🕑 Published: April 21, 2026 at 10:50 AM CST
హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. సాంస్కృతిక విభాగం ఆధ్వర్యంలో తుంగ్ చుంగ్ కమ్యూనిటీ హాలులో ఈ వేడుకలు ఏర్పాటు చేశారు. తెలుగు అలంకరణలతో ప్రాంగణం ఆకర్షణీయంగా మారింది. వినాయక ప్రార్థనతో ప్రారంభమై, తెలుగు బడి విద్యార్థులు ఆలపించిన ‘మా తెలుగు తల్లి’ గీతంతో వేడుకలు ప్రారంభించారు.
హాంకాంగ్-మకావోలోని భారత కాన్సులేట్ నుండి కాన్సులర్ దీప్తి పెరుమాళ్, ఐలాండ్స్ ఆఫీస్ అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ రైర్సన్ ఇప్, తుంగ్ చుంగ్ కేర్ టీమ్ కెప్టెన్ మే చౌలు ప్రత్యేక అతిథులుగా పాల్గొని ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. సమాఖ్యా వ్యవస్థాపక అధ్యక్షురాలు జయా పీసపాటి స్వాగతోపన్యాసం చేశారు. చిన్న ప్రయత్నంగా మొదలైన సమాఖ్య, నేడు హాంకాంగ్‌లోనే కాక ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారసత్వాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిలబెట్టేందుకు కృషి చేస్తోందని తెలిపారు. ఆఫ్రికన్ సామెత "వేగంగా వెళ్లాలనుకుంటే ఒంటరిగా వెళ్లండి..దూరంగా వెళ్లాలనుకుంటే కలిసి వెళ్లండి" భావాన్ని సమాఖ్య ప్రతిబింబిస్తుందని వెల్లడించారు. సమాఖ్యా కార్యక్రమాలను వీడియో ద్వారా ప్రదర్శించారు. రాజ్యసభ మాజీ సభ్యుడు డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వీడియో ద్వారా తమ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో పెద్దలు, పిన్నలు పాల్గొని ప్రేక్షకులలో ఉల్లాసభరితమైన వాతావరణాన్ని సృష్టించారు. ప్రతి సంవత్సరం అందించే ఉగాది పురస్కారం ఈసారి హనుమాన్ చారిటీ స్థాపకులు నవీన్-బియాంకా సిధ్వానిలకు అందజేశారు. రమేష్ రేణిగుంట్ల, రమాదేశవి సారంగా, రాజశేఖర్ మన్నే, హరీన్ తుమ్మల తదితరులు సహకరించారు. ఉగాది క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. జాతీయ గీతాలాపనతో వేడుకకు ముగింపు పలికారు.










