🕑 Published: May 03, 2026 at 01:01 PM CST
స్వరలయ ఆర్ట్స్ సింగపూర్ ఫైన్ ఆర్ట్స్ అకాడెమీ వారు తమ సంస్థ సప్తమ వార్షికోత్సవం ఏప్రిల్25, 2026న ఘనంగా జరుపుకున్నారు.
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య వెలుదండ నిత్యానందరావు ముఖ్య అతిధిగా విచ్చేసిన ఈ కార్యక్రమం ప్రొఫెసర్ శ్రీ బి.వి.ఎస్. చౌదరి, శ్రీమతి రాజ్యలక్ష్మి చౌదరిగార్ల సమక్షంలో సింగపూర్ శివకృష్ణ దేవాలయంవారి ఫంక్షన్ హాలు వేదికగా జరిగింది.
స్వరలయ సంస్థ విద్యార్ధుల సంగీత మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ఆహూతులను అలరించారు. కుమారి శ్రీవిద్య పంతువరాళి రాగంలో “ఎన్నగాను రామభజన” త్యాగరాజ కీర్తనను హృద్యంగా గానం చేసి ప్రేక్షకుల శుభకామనలు అందుకున్నారు. స్వరలయ వ్యవస్థాపక అధ్యక్షురాలు, గురు శేషుకుమారి సంగీత ప్రదర్శనలో ఆలపించిన త్యాగరాజ కీర్తన “ప్రక్కల నిలబడి”, ఒక “మీరా భజన్” మరియు విద్యార్థులతో కలిసి చేసిన జానపద గీతం ప్రేక్షకుల నుండి విశేష ప్రశంసలు అందుకున్నాయి.
తరువాత తెలుగు విశ్వవిద్యాలయం గ్రేడ్ మరియు యూనివర్సిటీ కోర్సులలో ఉత్తీర్ణులైన సంగీత విద్యార్ధులకు VC శ్రీ నిత్యానందరావు అర్హతాపత్రాలు, ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీమతి శేషుకుమారి సంగీత ప్రస్థానాన్ని ప్రశంసించారు. చదివినది ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అయినా చిన్నతనంనుంచీ సంగీతం పట్ల ఉన్న ఆసక్తి, అనురక్తి కర్నాటక సంగీత రీతులను, లోతులను కొలిచేలా, సంగీతకళను భావితరాలకి అందించేలా ఆమెను నడిపిస్తున్నాయని ఆయన అన్నారు. స్వరలయ విద్యార్ధులు భవిష్యత్తులో కర్నాటక సంగీతరంగంలో తమవైన విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
హార్మనీ & హ్యూస్ అధ్యక్షురాలు శ్రీమతి శ్యామల ప్రసంగిస్తూ 2025లో తిరుపతిలో అన్నమాచార్య 500వ జయంతి ఉత్సవాలలో చేసిన సంగీత కచేరీ, శ్రీమతి శేషుకుమారి వంశీ-సీల్వెల్ ఫౌండేషన్ వారి మంగళంపల్లి బాలమురళీకృష్ణ అవార్డ్ అందుకోవడం స్వరలయసంస్థ సాధించిన కొత్త మైలురాళ్ళని కొనియాడారు. గురు శ్రీమతి శేషు కుమారిని “సింగపూర్ గాన కోకిల”గా అభివర్ణిస్తూ, ఆమె శిష్యులు ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదే సందర్భంలో కుమారి మనోజ్ఞ అనే గాత్రసంగీత విద్యార్ధి మాట్లాడుతూ కర్నాటక గాత్ర సంగీతాన్ని ఒక O-level ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకుని పరీక్షలు వ్రాసేందుకు MOE (సింగపూర్ విద్యాశాఖ) తాను అనుమతి సాధించగలగటం విశేషం అనీ, ఇది తన గురువు ఇచ్చిన స్ఫూర్తి, మార్గదర్శకత్వం వల్లనే సాధ్యమైందనీ, సంగీతం ఒక సబ్జెక్టుగా తీసుకోవడంతో ఇటు సంగీతంలో కృషి, అటు చదువుకునే సమయాన్ని సమర్ధవంతంగా వాడుకోవడం వీలవుతోందని చెప్పారు.
ఈ సంవత్సరం స్వర లయ ఆర్ట్స్ తన కార్యకలాపాలను విస్తరించి, గురు శ్రీమతి కృష్ణ శృతి గారి మార్గదర్శకత్వంలో కూచిపూడి నృత్యాన్ని ప్రవేశపెట్టినట్లు శ్రీమతి శేషుకుమారి వివరించారు.
ఈ వేడుకలో మరో ప్రత్యేక ఆకర్షణగా, గురు శ్రీమతి శేషుకుమారి తాళం మరియు రాగం నేర్పించేందుకు వినూత్నమైన సంగీత ఆటలను ప్రవేశపెట్టారు. ఇవి ప్రత్యక్షంగా వేదికపై నిర్వహించబడి, సంగీత శిక్షణలో ఒక కొత్త పోకడను పరిచయం చేశాయి.
యూ.టీ.ఐ.ఏ.ఈ.సీ చైర్మన్ శ్రీ రాయ్ మరియు ట్రెజరర్ v. Adesh బాబు , కళ గారు , శ్రీ శివ కృష్ణ ఆలయ చైర్మన్ మరియు మేనేజర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శ్రీసాంస్కృతిక కళాసారధి అధ్యక్షులు కవుటూరి రత్నకుమార్, కాకతీయ సబ్బు ,సింగపూర్ తెలుగు వనితలు సమూహం నుండి శ్రీ క్రాంతి, జయ, దీపు , రేఖ , రాణి, గాయత్రి వంటి అతిథుల సమక్షంలో ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. పిల్లల ఉత్సాహభరితమైన ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించి, వేడుకను విజయవంతంగా ముగించాయి.
సౌజన్య చక్కటి వ్యాఖ్యానంతో కార్యక్రమాన్ని రక్తి కట్టించారు
స్వర లయ ఆర్ట్స్ సింగపూర్‌లో భారతీయ సాంప్రదాయ సంగీతం మరియు నృత్య సంప్రదాయాలను ప్రోత్సహిస్తూ, అభివృద్ధి చేస్తూ ముందుకు సాగుతోంది.








