🕑 Published: June 23, 2026 at 10:44 AM CST
అమెరికాలోని సిన్సినాటి నగరంలో శనివారం నాడు డా. రామినేని ఫౌండేషన్-సిన్సినాటి తరంగిణి తెలుగు అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కళారత్న కె.వి. సత్యనారాయణ రచన, నృత్య దర్శకత్వంలో రూపొందిన "మోహిని భస్మాసుర" కూచిపూడి నృత్యనాటకం అలరించింది. మోహిని పాత్రలో చదలవాడ శ్రిల హైంధవి, భస్మాసురుడి పాత్రలో చదలవాడ శ్రీధ వరాళిల నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. వంశీ డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు ఇతర పాత్రలను సమర్థవంతంగా పోషించారు. కార్యక్రమానికి వంశీ చిట్టాజల్లు వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
ఈ నృత్యనాటక ప్రదర్శనకు సిద్ధం చేయడానికి కళారత్న కె.వి. సత్యనారాయణ పది రోజుల పాటు సిన్సినాటిలో ఉండి కళాకారులకు శిక్షణ ఇచ్చారు. మొత్తం 37 మంది కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. అమెరికాలోని ప్రముఖ ప్రదర్శన వేదికలలో ఒకటిగా గుర్తింపు పొందిన ఎమరీ థియేటర్‌లో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ప్రదర్శన అనంతరం నృత్యరంగానికి చేసిన విశిష్ట సేవలు, ప్రతిభకు గుర్తింపుగా కళారత్న కె.వి. సత్యనారాయణను డా. రామినేని ఫౌండేషన్ ఛైర్మన్ రామినేని ధర్మాచార్య, ఏపీ భాజపా మీడియా వ్యవహారాల ఇన్‌ఛార్జ్ పాతూరి నాగభూషణం, డా. చదలవాడ రాజగోపాల్, చదలవాడ శారదలు ఘనంగా సన్మానించారు.


