🕑 Published: June 19, 2026 at 12:38 PM CST
ఆంధ్రప్రదెశ్ రాజధాని అమరావతిలోని మేధా టవర్స్‌లో రాష్ట్రంలోనే తొలి క్వాంటం ఇంక్యుబేటర్‌ను చండీగఢ్ యూనివర్సిటీ ఎండీ జై ఇందర్ సింగ్ సందు, క్వాంటం వ్యాలీ డైరెక్టర్ శ్రీధర్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ, ఎండీ సూర్యతేజలు ప్రారంభించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి, ఐటీ మంత్రి నారా లోకేశ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్వాంటం, డీప్‌టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మోహనకృష్ణ తెలిపారు. ఆవిష్కరణలు, స్టార్టప్‌ల ప్రోత్సాహంలో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందిన చండీగఢ్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో రాష్ట్ర యువతకు సువర్ణావకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. క్వాంటం ఇంక్యుబేటర్ ద్వారా విద్యార్థులు, పరిశోధకులు, స్టార్టప్‌లకు ప్రపంచ స్థాయి మెంటారింగ్, అత్యాధునిక క్వాంటం కంప్యూటింగ్ వనరులు, పరిశ్రమలతో అనుసంధానం, పెట్టుబడిదారులతో భాగస్వామ్య అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.
క్వాంటం వ్యాలీ డైరెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ.. క్వాంటం టెక్నాలజీ భవిష్యత్తు ప్రపంచాన్ని నిర్దేశించే విప్లవాత్మక రంగమని అభివర్ణించారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రపంచ స్థాయిలో రాణించాలని రాష్ట్ర యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవో ధాత్రి రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అంతకుముందు చండీగఢ్ యూనివర్సిటీ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్(CUBIC)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మయూరి టెక్‌లో మోహనకృష్ణ అవగాహన ఒప్పందం(MOU)పై సంతకాలు చేశారు.

