🕑 Published: October 06, 2026 at 09:55 AM CST
అమెరికాలోని ప్రముఖ విమానయాన సంస్థ యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో డైరెక్టర్ ఆఫ్ సర్టిఫికేషన్‌గా ప్రవాస తెలుగు వ్యక్తి గన్నిరాజు తుమరాడ పదోన్నతి పొందారు. యునైటెడ్ టెక్ ఆప్స్ వైస్ ప్రెసిడెంట్ మారా పాలిస్కో ఆయన నియామకాన్ని అధికారికంగా ప్రకటించారు. జార్జియా రాష్ట్రంలోని సవన్నాలో నివసిస్తున్న రాజు కొత్త బాధ్యతల్లో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానాల సర్టిఫికేషన్, నియంత్రణ వ్యవహారాలు, విడిభాగాల తయారీ, ఇంజినీరింగ్ డేటా, సాంకేతిక నాయకత్వం, భద్రతా ప్రమాణాల బలోపేతంపై దృష్టి సారించనున్నారు. అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్.ఏ.ఏ)కు యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు మధ్య ఆయన వారధిగా సమన్వయం చేస్తారు. 2019లో యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో చేరిన ఆయన లీడ్ అడ్మినిస్ట్రేటర్‌గా, సీనియర్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహించారు. విమానాల మార్పులు, క్యాబిన్‌లు, ఇన్‌ఫ్లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ తదితర విభాగాలకు సంబంధించిన సర్టిఫికేషన్ కార్యక్రమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి డిజిగ్నేటెడ్ ఇంజినీరింగ్ రిప్రజెంటేటివ్‌గా నియమితులైన తొలి భారతీయ-తెలుగు సంతతి వ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు. యునైటడ్ ఎయిర్‌లైన్స్‌కు పూర్వం 20ఏళ్ల పాటు అమెరికావ్యాప్తంగా పలు విమానయాన సంస్థల్లో పనిచేసి అనుభవం గడించారు.
ఏలూరుకు చెందిన కుటుంబానికి హైదరాబాద్‌లో జన్మించిన రాజు తుమరాడ వనస్థలిపురంలో ప్రాథమిక విద్యనభ్యసించారు. 1999లో గుల్బర్గా యూనివర్సిటీ పరిధిలోని ఎస్‌ఎల్‌ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్, 2003లో అమెరికాలోని విచిటా స్టేట్ యూనివర్సిటీ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఎంఎస్ పట్టాలు పొందారు.
