🕑 Published: October 07, 2026 at 03:49 PM CST
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రవాసులతో తెదేపా అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ పిల్లి గురురాజాతో జరిగిన సమావేశంలో చర్చించినట్లు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ తెలిపారు. పార్టీతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో ఎన్‌ఆర్‌ఐలు కీలక భాగస్వాములని ఆయన పేర్కొన్నారు.
ఎన్‌ఆర్‌ఐ టీడీపీ కమిటీల ఏర్పాటు, సభ్యత్వ నమోదు ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయడంతో పాటు ఎన్‌ఆర్‌ఐలు, ఎమ్మెల్యేలు, పార్టీ మధ్య మరింత బలమైన సంస్థాగత అనుసంధానం కల్పించాలని సమావేశంలో చర్చించినట్లు లోకేశ్ తెలిపారు. తాను ప్రతి మూడు నెలలకు ఒకసారి జూమ్ సమావేశాల ద్వారా ఎన్‌ఆర్‌ఐ టీడీపీ బృందాలతో నేరుగా మాట్లాడతానని, ఎమ్మెల్యేలు కూడా ప్రవాసాంధ్రులతో నిరంతరం అనుసంధానమై, తమ నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర అభివృద్ధిలో వారిని భాగస్వాములను చేయాలని సూచించారు. విదేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగు ప్రజలకు తొలి సహాయక కేంద్రంగా ఎన్‌ఆర్‌ఐ టీడీపీ విభాగం పనిచేయాలని లోకేశ్ అన్నారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగు ప్రజలు తమ మూలాలు, ప్రజాప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధితో అనుసంధానమై ఉండేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.
