🕑 Published: October 07, 2026 at 05:03 PM CST
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(TANTEX) 40వ వార్షికోత్సవ వేడుకలను ఈ నెల 24న ఫ్రిస్కోలో ఏర్పాటు చేశారు. తెలుగు సంస్కృతి, సాహిత్యం, సంగీతం, సంప్రదాయాలను ప్రతిబింబించే మూడు ప్రత్యేక కార్యక్రమాలను ఈ సందర్భంగా ఏర్పాటు చేసినట్లు అధ్యక్షురాలు మాధవి లోకిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి బెజవాడ బేబక్క యాంకర్‌గా వ్యవహరించనున్నారు. కార్యక్రమానికి నమోదు తప్పనిసరి. ప్రవేశం ఉచితం.
అట్లతద్ది వేడుకల్లో గౌరీ పూజ, గోరింటాకు, ఉయ్యాల, అట్ల వాయనం, కోలాటం ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. టాంటెక్స్ తెలుగు సాహిత్య వేదిక 19వ వార్షికోత్సవం కూడా ఇదే వేదికపై నిర్వహించనున్నారు. తెలుగు సాహిత్యాభిమానులను, రచయితలను, సాహితీవేత్తలను, తెలుగు భాషాభిమానులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్తలు, వక్తల ప్రత్యేక ప్రసంగాలు, సాహిత్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయంత్రం కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు కోటి ఆధ్వర్యంలో "కోటి మ్యూజికల్ లైవ్ కాన్సర్ట్" అలరించనుంది. ఈ విభావరిలో సాయి శ్రీ చరణ్, నజీరుద్దీన్, శివాని పిసుపాటి, వైష్ణవి నన్నూరు తదితర గాయకులు పాల్గొననున్నారు. లైవ్ బ్యాండ్‌లో బాబు (గిటార్), దిలీప్(బాస్), శ్రీధర్ వైద్యనాథన్ (కీబోర్డ్స్), కృష్ణ యమన్ (డ్రమ్స్) సహకరిస్తారు. ఈ కార్యక్రమానికి కేదార్ జోస్యుల, గీతికలు ఎంసీలుగా వ్యవహరించనున్నారు.
తెలుగు కుటుంబాలు, సాహిత్యాభిమానులు, సంగీతప్రియులు మరియు ఉత్తర టెక్సాస్‌లోని తెలుగు సమాజం ఈ చారిత్రాత్మక 40వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని టాంటెక్స్ నిర్వాహకులు ఆహ్వానించారు.
వేదిక: Frisco Flyers Event Center
చిరునామా: 6300 Flyers Way, Frisco, TX 75034
తేదీ: శనివారం, అక్టోబర్ 24, 2026
ప్రవేశం: ఉచితం | పార్కింగ్: ఉచితం
మరిన్ని వివరాలకు: www.tantex.org




