🕑 Published: November 23, 2026 at 10:28 AM CST
తెలుగు రాష్ట్రాల్లో తానా ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తానా ఫౌండేషన్ ఛైర్మన్, ప్రముఖ వైద్యుడు డాక్టర్ నల్లూరి ప్రసాద్ తెలిపారు. తన స్వగ్రామం ఏలూరు జిల్లా టి.నర్సాపురం ప్రాంతంలో సేవా కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఆదివారం తన సతీమణి లక్ష్మితో కలిసి ఆ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ‘మేము సైతం’ మిత్ర బృందం సభ్యులు దంపతులను శాలువాతో ఆత్మీయంగా సత్కరించి స్వాగతం పలికారు.
డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తానా ఫౌండేషన్ సహకారంతో ‘మేము సైతం’ ఆధ్వర్యంలో చేపట్టిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని డాక్టర్ నల్లూరి ప్రసాద్ దంపతులు ప్రారంభించారు. ‘మేము సైతం’ మిత్ర బృందం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని వారు ప్రశంసించారు. స్థానికంగా ఉన్న దివ్యాంగ యువతికి వ్యక్తిగతంగా కొంత ఆర్థిక సహాయాన్ని కూడా డాక్టర్ ప్రసాద్ అందించారు.
ఈ సందర్భంగా డాక్టర్ నల్లూరి ప్రసాద్ మాట్లాడుతూ.. తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమెరికాతో పాటు స్వదేశంలోనూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. త్వరలో టి.నర్సాపురం హైస్కూల్‌లో సంబంధిత అధికారుల అనుమతితో విద్యార్థినీ విద్యార్థులకు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే సీపీఆర్ శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సామాజిక కార్యకర్త ఎస్.డి. నాజర్ పాషా మాట్లాడుతూ.. తన చిన్ననాటి స్నేహితుడు డాక్టర్ ప్రసాద్ తన సతీమణితో కలిసి తమ గ్రామానికి రావడం, మేము సైతం మిత్ర బృందం చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు కొరివి నాగేశ్వరరావు, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జాతీయ అవార్డు గ్రహీత పింగుల మధు, జమీలా బేగం, అబ్దుల్లా, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
