కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలతో తానా సాహితీ సదస్సు

Featured Image

తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో ‘నెల నెలా తెలుగు వెలుగు’ పేరిట ప్రతి నెల ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ‘కేంద్ర సాహిత్యఅకాడమీ పురస్కార గ్రహీతలతో మాటా మంతీ’ నిర్వహించారు. 80వ అంతర్జాతీయ ఆన్‌లైన్‌ దృశ్య సమావేశంలో పాల్గొన్న అతిథులందరికీ తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు స్వాగతం పలికారు. ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న తెలుగు సాహితీవేత్తల్లో పలువురు ఒకేవేదికపై పాల్గొనడం ఆనందంగా ఉందంటూ అతిథులందరికీ స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. ‘‘అసంఖ్యాకంగా ఉన్న భారతీయ భాషల్లో 24 భాషలకు ఏటా కేంద్ర సాహిత్యఅకాడమీ ప్రదానం చేస్తోంది. సంస్థ ద్వారా పురస్కారాలు అందుకున్న ఎనిమిది మంది సాహితీవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని, పురస్కారం పొందిన రచనలపై స్వీయవిశ్లేషణ చేయడం వినూత్నంగా ఉంది. ఇప్పటివరకు కేవలం భారతీయ పౌరసత్వం కలిగినవారు మాత్రమే ఈ పురస్కారాలు అందుకోవడానికి అర్హులు. కానీ, పద్మ పురస్కారాల మాదిరిగానే భారతీయ పౌరసత్వంతో సంబంధం లేకుండానే వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయ మూలాలున్న రచయితలకు సైతం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులకు అర్హులను చేస్తే మరిన్ని వైవిధ్యభరితమైన రచనలు పోటీలకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని పరిశీలించాలి’’ అని కోరుతూ లక్షలాదిమంది ప్రవాసభారతీయుల తరపున కేంద్ర సాహిత్య అకాడమీకి డా. ప్రసాద్ తోటకూర విజ్ఞప్తి చేశారు.

గత పన్నెండేళ్లుగా కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శిగా పనిచేస్తున్న డా. కృతివెంటి శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ‘కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార పోటీలకు వచ్చే తెలుగు రచనలు ఇతర భాషలతో పోల్చిచూస్తే వాసిలోను, రాశిలోనూ సంతృప్తికర స్థాయిలో ఉన్నాయి. అయితే మన తెలుగు రచనలు ఎక్కువగా ఆంగ్లం, హిందీ తదితర భాషల్లోకి ఎక్కువగా అనువాదం కావాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది నుంచి రచయితలు ఎవరికి వారే ఈ పోటీలకు తమ రచనలను పంపొచ్చు’’ అన్నారు. ఈ సాహిత్య కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా డా. గోరటి వెంకన్న, డా. మధురాంతకం నరేంద్ర, డా. తల్లావజ్జల పతంజలి శాస్త్రి, డా. ఎలనాగ (నాగరాజు సురేంద్ర), పెనుగొండ లక్ష్మీనారాయణ, పమిడిముక్కల చంద్రశేఖర ఆజాద్, డా. తుర్లపాటి రాజేశ్వరి తమ పురస్కార రచనల విశేషాలను ఆసక్తిగా పంచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ కింది వీడియోలో చూడొచ్చు.

Register for NATS 8th America Telugu Sambaralu in Tampa Florida - www.sambaralu.org

Tags-TANA Literary Meet With Kendra Sahitya Academy Award Winners

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles