డాలస్ సాహితీప్రియులతో సమావేశమైన బుర్రా సాయిమాధవ్

Featured Image

ప్రముఖ రంగస్థల నటుడు, రచయిత, సినిమా సంభాషణల రచయిత బుర్రా సాయిమాధవ్ డాలస్ సాహితీప్రియులతో సమావేశమయ్యారు. డా. ప్రసాద్ తోటకూర ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు. తన విజయాల వెనుక కృషిని, తన నేపథ్యాన్ని వివరించిన ఆయన సాహితీ ప్రియుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.

కృష్ణం వందే జగద్గురుం సినిమాతో సినీ సంభాషణల రచయితగా సినీ రంగానికి పరిచయమవడం, తాను మాటలు రాసిన కంచె, మహానటి చిత్రాలు భారత ప్రభుత్వం నుండి ఉత్తమ ప్రాంతీయ చిత్రాలుగా జాతీయ పురస్కారాలు అందుకోవడం, మళ్లీ మళ్లీ ఇది రానిరోజు సినిమాకు ఉత్తమ మాటల రచయితగా నంది పురస్కారం, పుత్తడిబొమ్మ, సీతామహాలక్ష్మి ధారావాహికలకు ఉత్తమ రచయితగా నంది పురస్కారాలు అందుకోవడం తన రచనా జీవితంలో కొన్ని మైలురాళ్ళు మాత్రమేనని, ఇంకా ఎంతో సాధించాలని అన్నారు. ప్రేక్షకాదరణ తనకు ఎంతో సంతృప్తిని, బలాన్ని ఇచ్చిందని ఈ అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు, నటులకు, ఆదరించిన ప్రేక్షకులకు సాయిమాధవ్ ధన్యవాదాలు తెలిపారు. సామాజిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇస్తానన్నారు.

డా. ప్రసాద్ తోటకూర అతిథులతో కలిసి సాయిమాధవ్‌ను ఘనంగా సత్కరించారు. తన మూలాలను మరిచిపోకుండా నాటక రంగాన్ని విస్మరించకుండా, కళల కాణాచి సాంస్కృతిక సంస్థను స్థాపించి రంగస్థల కళాభివృద్ధికోసం లక్షలాది రూపాయల తన సొంత నిధులను వెచ్చిస్తున్న సాయిమాధవ్‌ను ఆయన అభినందించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుడు శ్రీరామశాస్త్రి రచించిన 'సిరివెన్నెల తొలి గురువు సమ్మాన్యుడు కొత్తగా' అనే పుస్తకాన్ని డా. ప్రసాద్ తోటకూర ఆవిష్కరించి తొలిప్రతిని బుర్రాకు అందజేశారు.

సత్యన్ కళ్యాణ్ దుర్గ్, రవీంద్ర పాపినేని, సాయి సత్యనారాయణ, రాజా రెడ్డి, మురళి వెన్నం, సిద్ధూ, రమేశ్ ప్రేమ్ కుమార్, శివకుమారి, గాయకులు గని మరియు వారి కుటుంబసభ్యులు, యాజీ జయంతి, చినసత్యం వీర్నపు, ప్రశాంతి హారతి, చంద్రహాస్ మద్దుకూరి, డా. నరసింహారెడ్డి ఊరిమిండి, రాంకీ చేబ్రోలు, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చంద్ర కన్నెగంటి, ఇక్బాల్, శ్రీనివాస్, డా. ఇస్మాయిల్ పెనుగొండ, దయాకర్ మాడ, డా. జగదీశ్వరన్ పూదూర్, చంద్రశేఖర్ లంక, లెనిన్ వేముల, అనంత్ మల్లవరపు, మడిశెట్టి గోపాల్, సతీష్ బండారు తదితరులు పాల్గొన్నారు.

Tags-Burra SaiMadhav Meets Dallas NRTs

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles