ఆస్టిన్ సాయిబాబా ఆలయంలో కార్పోరేట్ మ్యాచింగ్ నిధుల గోల్‌మాల్

Featured Image

2010లో ఆంగ్ల దంపతులు జిల్-క్రెయిగ్ ఎడ్వర్డ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు

₹17 కోట్ల మేర కార్పోరేట్ మ్యాచింగ్ గ్రాంట్స్ నిధులు డొల్ల కంపెనీలకు బదిలీ

ఉద్యోగాలు కోల్పోయిన 120 మంది భక్తుల కుటుంబాలు

వందల కోట్ల రూపాయిల సేవింగ్స్ కోల్పోయిన ప్రవాసాంధ్రులు

బాధితుల్లో యాపిల్-వీసా-డెల్ ఉద్యోగులు

కుట్రలో భాగస్వామ్యులుగా ఇద్దరు ప్రవాసాంధ్రులు

దర్యాప్తు చేస్తున్న ఫెడరల్ సంస్థలు

అమెరికాలో మరోసారి మ్యాచింగ్ గ్రాంట్ అవకతవకలకి ప్రవాసాంధ్రులు బలయ్యారు. ఇప్పటి వరకు తెలుగు సంఘాలకే పరిమితమైన ఈ కుంభకోణాలు, ఇప్పుడు హిందూ ఆలయలను సైతం తాకి నివ్వెరపరుస్తున్నాయి. తాజాగా టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ సమీపంలో సీడర్ పార్కులో గల శ్రీ షిర్డి సాయిబాబా టెంపుల్ ఆఫ్ ఆస్టిన్‌లో(SSSBT) సుమారు ₹17కోట్లను($20లక్షలు) కార్పోరేట్ మ్యాచింగ్ గ్రాంట్ పథకం ద్వారా సేకరించి బోర్డు సభ్యులు సరైన ఆమోదం లేకుండా స్వలాభానికి వినియోగించుకున్నారని అభియోగం. ఈ సొమ్ములను రికవరీ చేసి కార్పోరేట్ సంస్థలకు తిరిగి చెల్లించాలని ప్రస్తుత కార్యవర్గం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. మ్యాచింగ్ గ్రాంట్ నిధులను స్వలాభానికి వాడుకోవడమే గాక, డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి దాని ద్వారా భక్తులు ఇచ్చిన విరాళాలను దారి మళ్లించారనే అభియోగాలపై దర్యాప్తు సంస్థలు కసరత్తు ప్రారంభించాయి. మంచి నడవడిక, ధర్మం గురించి పది మందికి చెప్పాల్సిన ఆలయల్లోనే ఇలాంటి అక్రమాలు జరగడం పట్ల ప్రవాసాంధ్రులు దురదృష్టకరమని చింతిస్తున్నారు.

* ఏమిటీ మ్యాచింగ్ గ్రాంట్స్?

సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో భాగంగా అమెరికాలో పెద్ద కంపెనీలు తమ ఉద్యోగులు విరాళం ఇచ్చే ప్రతి డాలరుకు వారి అంతర్గత విధివిధానాలు అనుసరించి రెండింతలు జోడిస్తుంది. అంటే ఉద్యోగి $100 ఇస్తే కంపెనీ $200 ఇస్తుంది. వెరసి $300 సేవా కార్యక్రమాలు వెచ్చించాలి. ప్రతి ఉద్యోగి విరాళం యొక్క గరిష్ఠ మొత్తం కంపెనీ పాలసీని అనుసరించి ఉంటుంది.

* సూత్రధారులు

2007లో హవాయి నుండి ఆస్టిన్ వచ్చిన జిల్ ఎడ్వర్డ్స్, క్రెయిగ్ ఎడ్వర్డ్స్ దంపతులు ఆస్టిన్ సమీపంలో సీడర్ పార్కులో 5 ఎకరాల భూమిని కొనుగోలు చేసి బాబా ఆలయాన్ని 2010లో ప్రారంభించారు. నాన్-మెంబర్ సంస్థగా మొదలైన ఈ ఆలయానికి క్రెయిగ్ ఛైర్మన్‌గా, జిల్ కార్యదర్శిగా వ్యవహరించారు. నాన్-మెంబర్ సంస్థ అయినప్పటికీ మెంబర్ సంస్థ రీతిలో ఒక్కో కుటుంబం నుండి $10వేలు-$20వేలు వసూలు చేసి సభ్యులను చేర్చుకున్నారు. అలా 150 మందిని ట్రస్టీలుగా ఏర్పాటు చేసుకున్నారు. 2010-2024 మధ్య కాలంలో జిల్-క్రెయిగ్ దంపతులు ఆలయాన్ని తమ కనుసన్నల్లో నడిపించారు. వీరికి బాలాజి, కిషోర్ అనే ఇద్దరు ప్రవాసాంధ్ర కుటుంబాలు వంత పాడినట్లు సమాచారం. వీరంతా కలిసి ఆలయ బోర్డుగా ఏర్పడి ఈ అవినీతిలో పాలుపంచుకున్నారు.

* ప్రారంభం

ఆలయ ప్రాంగణంలో 2015లో శ్రీవేంకటేశ్వర ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. క్రెయిగ్ మృతితో ఈ ఇరువురు ప్రవాస తెలుగువారు తమ కుటుంబంతో కలిసి జిల్‌తో చేతులు కలిపి 2016 నుండి మ్యాచింగ్ గ్రాంట్స్ పథకం ద్వారా నిధులను అడ్డదారిలో సంపాదించేందుకు భక్తులను పావులుగా వాడుకున్నారు. ఆలయంలో వాలంటీరుగా పనిచేసే ఒక భక్తుడిని ఈ కార్యవర్గం మ్యాచింగ్ గ్రాంట్స్ ద్వారా నిధులు తేవాలని కోరింది. దీనితో ఆ భక్తుడు యాపిల్ సంస్థలో తన సొంత స్టాక్స్‌ను విక్రయించగా వచ్చిన $40వేలలో తనతో పాటు తన సహోద్యోగులు ముగ్గురికీ $10వేల చొప్పున పంపి మ్యాచింగ్ నిధులు $80వేలు రాబట్టాడు. మొత్తం $1లక్షా20వేలు ఆలయ ఖాతాలో జమచేశాడు. అయినప్పటికీ ఆ భక్తుడికి తన మూలధనం $40వేలు చెల్లించడానికి కూడా అప్పటి ఆలయ బోర్డు ఇబ్బంది పెట్టినట్లు సమాచారం. ఈ తతంగంతో ఆ నలుగురు ఉద్యోగులు యాపిల్‌లో తమ ఉద్యోగాలు కోల్పోయారు. వీరితో పాటు ఇదే విధంగా మ్యాచింగ్ గ్రాంట్స్ అవకతవకలకు పాల్పడిన ఇంకొంతమందితో కలిపి మొత్తం 20మందికి పైగా యాపిల్‌లో తమ ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. వీసా సంస్థలో ఇదే మాదిరి నిధుల సేకరణ జరిపి ఆ వివరాలను సంస్థ అంతర్గత టీమ్స్‌లో ఆలయ ట్రస్టీగా ఉన్న సీనియర్ డైరక్టర్ ఛాటింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. ఇతని కారణంగా మరో 100మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారని స్థానికులు అంటున్నారు. ఆలయం కారణంగా మొత్తం మీద 120 ప్రవాసాంధ్ర కుటుంబాల జీవితాలు అగమ్యగోచరంగా మారాయి. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. యాపిల్, వీసాతో పాటు డెల్ సంస్థల ఉద్యోగులు కూడా వీరిలో ఉన్నారు. ఇలా ఉద్యోగం కోల్పోడమే గాక కంపెనీ ఉద్యోగిగా లభించిన వందల కోట్ల విలువైన స్టాక్స్‌, దీర్ఘకాల సేవింగ్స్‌ను సైతం ప్రవాసాంధ్రులు కోల్పోయారు. ఈ పద్ధతిలో అక్రమంగా సేకరించిన ₹17కోట్లను అప్పటి మకిలీ కార్యవర్గం తమ అద్దెలు చెల్లించడానికి వాడారని, ఇండియాకు మనీ లాండరింగ్ చేశారని, డొల్ల కంపెనీ సాయి ఛారిటీస్‌కు బదలాయించారని అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ మొత్తం ప్రస్తుత కార్యవర్గం చేపట్టిన ఫొరెన్సిక్ నివేదికలో సమగ్రంగా పొందుపరిచారు.

* బయట పడింది ఇలా...

యాపిల్‌లో $40వేలు పెట్టి నిధులు సేకరించి ఉద్యోగం కోల్పోయిన సదరు భక్తుడు తన బాధను వెలిబుచ్చుతూ 2023 నవంబరులో ఆలయ ట్రస్టీలకు ఈమెయిల్ పంపాడు. అప్పటి వరకు నాన్-మెంబర్ సంస్థ అనే భావనలో ఉన్న భక్తులు మెంబర్ సంస్థ పద్ధతిలో డబ్బులు సేకరించి ట్రస్టీలను ఏర్పాటు చేసిన కారణంగా ఆలయ నాయకత్వంలో మార్పు కోసం తిరగబడ్డారు. చేసేది లేక శ్వేత జాతీయురాలితో పాటు ఇద్దరు ప్రవాసాంధ్రులు వారి కుటుంబ సభ్యులు రాజీనామా చేశారు. కొత్త కార్యవర్గం జరిపిన ఫొరెన్సిక్ ఆడిట్‌లో విస్తుపోయే వాస్తవాలు బయటకి వచ్చాయి. భారతదేశం నుండి ఒక పూజారిని ఆలయంలో పనిచేసేందుకు R1 వీసా మీద తీసుకువచ్చి అతడి ప్రతి నెల జీతభత్యాల చెల్లింపులో కూడా వీసా, పన్ను అవినీతికి పాల్పడినట్లు నివేదికలో పేర్కొన్నారు. అసలు ఆలాంటి అర్చకుడు ఆలయంలోనే లేడని నూతన కార్యవర్గం ప్రశ్నించగా..అతడి చిరునామా కాలిఫోర్నియాలో ఉందని, ఆ అర్చకుడు ఆలయంలోని తన బాధ్యతలను రిమోట్‌గా నిర్వహిస్తాడని పాత కార్యవర్గం చెప్పిన సమాధానం విని భక్తులు అవాక్కయ్యారు. ఇదే గాక హుండీలో వచ్చే నగదును సైతం బ్యాంకులో సరిగ్గా జమ చేయలేదని, ఖర్చుల వివరాలు సరిగ్గా చూపలేదని, భారతదేశంలో అన్నదానం చేశామని పొంతన లేని లావాదేవీలు జరిగాయని ఫొరెన్సిక్ నివేదిక స్పష్టం చేసింది.

* ఆస్టిన్‌ను వదిలేసిన జిల్..

క్రెయిగ్ మృతి తర్వాత జిల్ రెండో పెళ్లి చేసుకుంది. 2023 నవంబరులో యాపిల్ ఉద్యోగి రాసిన ఈమెయిల్ దరిమిలా రేగిన తిరుగుబాటుతో ఏర్పడిన నూతన కార్యవర్గం సమగ్ర దర్యాప్తుకు శ్రీకారం చుట్టింది. 2024 అక్టోబరులో దర్యాప్తు ప్రారంభించగా 2025 జనవరిలో డొల్ల కంపెనీలను మూసేసి జిల్ ఆస్టిన్ వదిలిపెట్టేసింది. ప్రస్తుతం ఫెడరల్ సంస్థలు ఆలయంలో జరిగిన ఈ ఆర్థిక అవకతవకలపై క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుత బోర్డు ఛైర్మన్, కోశాధికారి ఆయా సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. పాత కార్యవర్గం చేసిన ఆర్థిక అక్రమాల కారణంగా ఆలయ ప్రస్తుత 501సీ పరిస్థితి ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంది. దర్యాప్తు సంస్థల సహకారంతో చర్యలు చేపట్టి..ఆలయానికి పునర్వైభవం తీసుకొస్తామని ప్రస్తుత కార్యవర్గం అంటోంది.

---సుందరసుందరి(sundarasundari@aol.com)

Tags-ShirdiSaiBaba Temple of Austin Sai Austin Corporate Matching Fraud

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Austin Saibaba Temple Matching Grants Scam

Latest Articles