🕑 Published: April 20, 2026 at 09:44 AM CST
ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) వెల్‌నెస్ వెబినార్ నిర్వహించారు. ప్రముఖ నిర్మాత, వెల్‌నెస్ కోచ్, సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల ఘట్టమనేని ఈ వెబినార్‌లో ప్రధాన వక్తగా హాజరయ్యారు. నాట్స్ చైర్మన్ కిషోర్ కంచర్ల, నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బిందు యలమంచిలి ఈ వెబినార్‌ని సమన్వయించారు.
ధ్యానం ద్వారా తాను ఎదుర్కొన్న తీవ్రమైన మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలను ఎలా అధిగమించాననేది ఆమె వివరించారు. సెలబ్రిటీల స్థాయి ఆరోగ్యాన్ని, సంతోషాన్ని సొంతం చేసుకోవడానికి అవసరమైన మూడు రహస్యాలను ఆమె అతిథులతో పంచుకున్నారు. ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్ మానేసి, ఇంట్లో వండిన సహజమైన పోషకాహారం తీసుకోవాలని సూచించారు. శరీరం కదలిక కోసం పుట్టిందని, కాబట్టి నిరంతరం ఏదో ఒక వ్యాయామం చేయాలని చెప్పారు. తన సోదరుడు మహేష్ బాబు ఒకప్పుడు 115 కిలోల పైగా బరువుతో ఉండేవాడని, పట్టుదలతో జంక్ ఫుడ్ మానేసి, రోజూ రెండు గంటలు జాగింగ్ చేస్తూ 'రాజకుమారుడు' సినిమా నాటికి సిక్స్ ప్యాక్ సాధించాడని వెల్లడించారు.
సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవడం, ప్రకృతితో మమేకం అవ్వడం ద్వారా మెదడును ప్రశాంతంగా ఉంచుకోవచ్చని చెప్పారు. పీల్చే శ్వాస విధానం సరిగ్గా ఉండాలని, గాలి పీల్చినప్పుడు కడుపు బెలూన్‌లా బయటకు రావాలని, వదిలినప్పుడు లోపలికి వెళ్లాలని, దీనినే డయాఫ్రమాటిక్ లేదా బెల్లీ బ్రీతింగ్ అంటారని వివరించారు. తన తండ్రి కృష్ణ వరుసగా 14 సినిమాలు ఫ్లాప్ అయినా స్థిరంగా, ప్రశాంతంగా ఉండటానికి ఆయనలోని ఈ సహజమైన శ్వాసక్రియే కారణమని ఆమె గుర్తుచేసుకున్నారు. మంచి పుస్తకాలు చదవడం ద్వారా మెదడును చురుకుగా ఉంచుకోవచ్చని సూచించారు.
ఆత్మతో అనుసంధానం కావడానికి ధ్యానమే ఏకైక మార్గమని, తన 32 ఏళ్ల అనుభవంలో పది వేల గంటలకు పైగా ధ్యానం చేశానని ఆమె చెప్పారు. మనకు ఉచితంగా లభిస్తున్న సూర్యరశ్మి, ప్రేమించే కుటుంబం, నిరంతరం కొట్టుకునే గుండె.. ఇలా ప్రతిదాని పట్ల కృతజ్ఞతా భావం కలిగి ఉండాలని కోరారు. ఇతరులను, మనల్ని మనం క్షమించడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని వివరించారు.
ఇకపై తాను సినిమాలు నిర్మించనని, ప్రజలకు ఆరోగ్యంపై ఇలాంటి అవగాహన కల్పించడమే తన జీవిత లక్ష్యమని..ఇందుకోసం 'మన్ ఘట్' అనే వెల్‌నెస్ వేదికను నడుపుతున్నానని మంజుల స్పష్టం చేశారు. నాట్స్ హెల్ఫ్ లైన్ ద్వారా అందిస్తున్న ఇమ్మిగ్రేషన్ సమస్యలకు పరిష్కార సూచనలు, గృహహింస బాధితులకు సాయం, వైద్యపరమైన సెకండ్ ఒపీనియన్ వంటి అనేక సామాజిక సేవల గురించి నాట్స్ అధ్యక్షుడు శ్రీహరి మందాడి వివరించారు.

