🕑 Published: October 18, 2026 at 03:58 PM CST
బహ్రెయిన్‌లో నివసిస్తున్న తెలుగు ప్రవాసీయులు దసరా, బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. బహ్రెయిన్‌లోని తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన దసరా, బతుకమ్మ ఉత్సవాలలో తెలుగు సంప్రదాయాలకు అద్దం పట్టేలా మహిళలు, చిన్నారులు రంగురంగుల బతుకమ్మలతో ఉత్సాహంగా పాల్గొని, సంప్రదాయక ఆటపాటలతో వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అమ్మవారిని ప్రతిష్ఠించి, నవదుర్గల అలంకరణలతో దసరా పండుగ ఆధ్యాత్మిక వైభవాన్ని చాటారు. ఉత్సవానికి భారత రాయబారి డాక్టర్ ప్రదీప్ సింగ్ రాజ్ పురోహిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. విదేశీ గడ్డపై తెలుగు పండుగలను ఘనంగా నిర్వహిస్తూ, తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను పరిరక్షించడంలో తెలుగు కళా సమితి చేస్తున్న కృషిని ఈ వేడుకలు మరోసారి చాటిచెప్పాయని తెలుగు కళా సమితి అధ్యక్షుడు యుగంధర్ కరణం పేర్కొన్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన తెలుగు ప్రజలను ఒక వేదికపైకి తీసుకువచ్చి, సాంస్కృతిక ఐక్యతను పెంపొందించిన ఈ కార్యక్రమం ప్రశంసలను అందుకుంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని ఆబుధాబిలో శుక్రవారం తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ (TFA) ఆబుధాబిలో బతుకమ్మ ఉత్సవాలు మైమరపించాయి. మహిళల సామూహిక జీవనసౌందర్యాన్ని తెలంగాణ ప్రవాసీయులు ప్రతిబింబించారు. సంబరాలకు ముఖ్య అతిధిగా భారతీయ ఎంబసీ సీనియర్ దౌత్యవేత్త సౌమ్య గుప్తా, గౌరవ అతిథిగా మరో దౌత్యవేత్త డాక్టర్ బాలాజీ రామస్వామి, ప్రత్యేక అతిథిగా బీజేపీ నాయకులు దాస్యం అభినవ్, ఇండియన్ సోషల్ అండ్ కల్చరల్ సెంటర్ అధ్యక్షుడు బీజీ థామస్‌లు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన విభిన్న ప్రవాసీ సంఘాల ప్రతినిధులు పాల్గొని బతుకమ్మ వేడుకలను తిలకించారు. సంప్రదాయ నృత్యాలతో నాలుగు గంటల పాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో మహిళలు, యువతులు, చిన్నారులు ప్రత్యేక నృత్యాలను ప్రదర్శించారు.





