🕑 Published: October 27, 2026 at 10:39 AM CST
చైనాలోని షాంఘై నగరంలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా-షాంఘై తెలుగు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, హాంకాంగ్ తెలుగు సమాఖ్య, లోక్ నాయక్ ఫౌండేషన్, వంశీ ఆర్ట్ థియేటర్స్, మలేసియా తెలుగు సంఘం సంస్థల సహకారంతో శని, ఆదివారాల్లో "10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు" వైభవంగా నిర్వహించారు. భారతదేశం, అమెరికా, మలేసియా, ఆస్ట్రేలియా, హాంకాంగ్, సింగపూర్, ఒమాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల నుంచి ప్రముఖ సాహితీవేత్తలు, రచయితలు, కవులు, భాషాభిమానులు ప్రత్యక్షంగా, ఆన్‌లైన్ ద్వారా పాల్గొని ఈ సదస్సును విజయవంతం చేశారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అభినందన సందేశం పంపించారు. నటుడు, రచయిత తనికెళ్ల భరణి ప్రధానోపన్యాసం చేశారు. సాహితీవేత్త డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ కీలకోపన్యాసం చేశారు. చైనాలో మొట్టమొదటిసారిగా విస్తృత స్థాయిలో తెలుగు సాహితీ సదస్సు నిర్వహించడం విశేషమని వక్తలు పేర్కొన్నారు.
రెండురోజుల పాటు జరిగిన ఈ సదస్సులో సాహితీవేత్తలు తమ రచనలను, పరిశోధనలను సాహితీ అభిమానులతో పంచుకున్నారు. తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, ఆధునిక రచనా ధోరణులు, ప్రవాస తెలుగు సాహిత్యం వంటి విభిన్న అంశాలపై ముప్పైకి పైగా ప్రసంగాలు చేశారు. వంగూరి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వంగూరి చిట్టెన్ రాజు మాట్లాడుతూ ఈ సదస్సు ద్వారా తెలుగు భాషాభివృద్ధి పట్ల ఆసక్తి, సాహిత్యాభిలాష పట్ల అభిరుచి పెంపొందించాలని తాము ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. మలేషియాకు చెందిన ప్రవాసాంధ్రుడు డా. మద్దెల అచ్చయ్యకుమార్ రావుకి “జీవన సాఫల్య పురస్కారం” ప్రదానం చేశారు. దివంగత సాహితీవేత్త డా. తెన్నేటి సుధాదేవి స్మృతికి సదస్సును అంకితం చేశారు. శాయి రాచకొండ నిర్వహణలో సాగిన ఈ సదస్సులో పది నూతన గ్రంథాలు ఆవిష్కరించారు. వెంకట్ నాగం రచించిన “రచ్చబండ చర్చలు”, “కలగూర గంప”, రాధిక మంగిపూడి రచించిన “గీత నుంచి గీతాల దాకా”, ఆర్. శర్మ దంతుర్తి రచించిన “విలువల వంతెన”, డా. నోముల నర్మద రెడ్డి రచించిన “చుక్ చుక్ రైలులో మా ప్రయాణం”, వంగూరి చిట్టెన్ రాజు రచించిన “అవేమైనా జ్ఞాపకాలా, మర్చిపోవడానికి?", న్యూజీలండ్ రచయిత సతీష్ గొల్లపూడి రచించిన బాల సాహిత్యం “స్వర్గ కాలం”, చైనా నుంచి వెలువడిన మొట్టమొదటి తెలుగు గ్రంధం సురేంద్ర నూకల రచించిన "భారతీయ హృదయం ప్రవాస జీవితం" వంటి గ్రంథాలు సాహితీప్రియుల ప్రశంసలు అందుకున్నాయి. రామా చంద్రమౌళి గ్రంధం “కాల నాళిక”కి డా.దుర్గా శశికిరణ్ ఆంగ్ల అనువాదం “KairoNexus” ఆకర్షణగా నిలిచింది.
షాంఘై ప్రవాసులు భవాని వాసిరెడ్డి ("శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు"), సరిపల్లి వర్ణిక ("చైనా- నా జీవితాన్ని మార్చిన ఎనిమిదేళ్ళు"), పద్మలత నూకల ("భాష యొక్క ప్రాముఖ్యత"), హరిబాబు రాయి ("20ఏళ్ళ చైనా అనుభవాలు"), గరిమ కొండా ("ముందు తరానికి తెలుగు భాష, సంప్రదాయం"), మోనిక సుంకర ("వలస పాలన నాటి షాంఘైలో భారతీయ సిక్కు పోలీసుల నివాసాలు (1920-1940)), బీజింగ్ వాసులు కీర్తి ఆజాద్ మండవ, సుమ కోదండరాం(“విక్రమార్కుని కథలు- మంగోలు భాష") ప్రసంగం ఆకట్టుకున్నాయి. డా. తనికెళ్ళ భరణితో ముఖాముఖీ, డా.మాధవరెడ్డి కొలన్ నిర్వహణలో జరిగిన “చైనాలో తెలుగు” చర్చావేదిక ఆసక్తికరంగా సాగాయి. వంశీ ఇంటర్నేషనల్ డా.వంశీ రామరాజు, రాధిక మంగిపూడి, కవుటూరు రత్నకూమార్ సంధానకర్తలుగా అంతర్జాలంలో నిర్వహించిన జూమ్ వేదికలో పలువురు సాహితీవేత్తలు ఆసక్తికరమైన ప్రసంగాలు చేశారు. విక్రమ్ సుఖవాసి సాంకేతిక సహకారం అందించారు. మలేషియా తెలుగు అకాడమీ బృందం “ప్రహ్లాద చరిత్ర” నృత్యనాటిక, హాంకాంగ్‌కు నాట్యాచార్యుడు సంజయ్ వడపల్లి నృత్య ప్రదర్శనలు, షాంఘై స్థానిక కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తెలుగు భాషను ప్రపంచ వేదికలపై మరింత విశిష్ట స్థానానికి తీసుకువెళ్లాలనే సంకల్పంతో ఈ సదస్సు విజయవంతంగా ముగిసిందని షాంఘై తెలుగు సంఘం అధ్యక్షుడు డా. మాధవరెడ్డి కోలన్ తెలిపారు. షాంఘై తెలుగు సంఘ ప్రతినిధులు నాగమల్లికార్జునరావు తోట, ఉదయభాస్కర్ పెయ్యేటి, వర్ణిక సరిపల్లి, రాహుల్ కోరాడ, సంగీత థామస్, పల్లవిలు నిర్వహణకు సహకరించారు. తెలుగు సాహిత్య చరిత్రలో చైనాలో తొలిసారిగా నిర్వహించిన తెలుగు సాహితీ సదస్సుగా ఈ కార్యక్రమాన్ని "తెలుగు బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డ్స్" అంతర్జాతీయ రికార్డుగా ప్రకటించి ప్రశంసాపత్రం అందజేశారు.


















