శాన్‌హోసేలో శివపదం నృత్యప్రదర్శన

Featured Image

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్‌హోసే నగరంలో జూలై 26న నిర్వహించిన 'శివపదం' నృత్యప్రదర్శన నిర్వహించారు. సామవేదం షణ్ముఖ శర్మ రచించిన శివపదాలను, కళాసంస్థాపకురాలు వాణి గుండ్లాపల్లి సమన్వయంతో అమెరికా వ్యాప్తంగా వచ్చిన నృత్య కళాకారులు విభిన్న భారతీయ నృత్యశైలుల్లో ప్రదర్శించారు. శివ విష్ణు ఆలయ ప్రాంగణంలో ఉన్న లకిరెడ్డి ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 900 మంది హాజరయ్యారు. జూలై 22 నుంచి 26 వరకు బే ఏరియాలో షణ్ముఖ శర్మ నిర్వహించిన “శివ మహిమామృతం” ప్రవచనోత్సవాల‌కు ఇది ముగింపు వేడుకగా నిలిచింది. 'శివపదంలో శక్తిరూపాలు' అనే శీర్షికతో ప్రదర్శించిన ఈ కార్యక్రమంలో దాదాపు 40 మంది అమెరికాలో నివసిస్తున్న విద్యార్థులు, ఉద్యోగస్తులు, కళాభిమానులు పాల్గొన్నారు. మోహినీయాట్టం, కూచిపూడి, భరతనాట్యం, ఒడిస్సీ, కథక్, మైసూర్ భరతనాట్యం వంటి రీతుల్లో శక్తితత్త్వాన్ని, అమ్మవారి రూపాలను, నదీ తత్త్వాన్ని, శివశక్తుల సంయోగాన్ని అభినయించారు. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, మల్లాది సూరిబాబులు ఆలపించారు.

నదీ స్వరూపంలో పరబ్రహ్మమైన సరస్వతిని కూచిపూడి నృత్యంలో ఆవిష్కరించగా, మోహినీయాట్టంలో బాలా త్రిపుర సుందరి వర్ణన అలరించింది. ఒడిస్సీలో 'వారాహీ రక్షతు మాం', కథక్‌లో కాళీమాత శక్తి స్వరూపం, భరతనాట్యంలో 'నీ కాలిగోటి రాకా సుధాంశువులు', 'అగజాధరమున నగవులవే' వంటి శక్తి వర్ణనలు, మోహినీయాట్టం-భరతనాట్యం సమన్వయంలో 'శ్రీ గజలక్ష్మి చింతయామ్యహం' వంటి పదాలను నాట్యరూపంలో తీర్చిదిద్దారు. మనస్విని 'అమ్మా వాణి అక్షర వాణి...' అనే శివపదానికి చేసిన నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. షణ్ముఖ శర్మ మాట్లాడుతూ సరస్వతి దేవిని ఇక్కడ మనస్విని సాక్షాత్కరింపజేసింది అని ప్రశంసించారు.

మిల్పిటాస్ మేయర్ కార్మెన్ మొంటానో మాట్లాడుతూ ఇది ఒక అరుదైన అనుభవం అని పేర్కొన్నారు. ముగింపు సందర్భంగా షణ్ముఖ శర్మ మాట్లాడుతూ, తన రచనలలోంచి ఎంపిక చేసిన పదాలకు నాట్యరూపం ఇచ్చిన వాణి గుండ్లాపల్లి కళా సమన్వయానికి అద్దంపడుతోందన్నారు. ఆమె ఇప్పటికే 12 దేశాల్లో 'శివపదం' నృత్య ప్రదర్శనల్ని విజయవంతంగా నిర్వహించారని, త్వరలో పారిస్ నగరంలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారని వెల్లడించారు.

Tags-Sivapadam Dance Medley In San Jose By Vani Gundlapalli

bodyimages:

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles