అమెరికాలో..అర్చకత్వం అద్భుతః - TNI ప్రత్యేకం

Featured Image

అమెరికా అనగానే ఠక్కున గుర్తొచ్చేది ఐటీ. ఇప్పుడు ఆ రంగంతో అర్చకత్వం పడుతోంది పోటీ! ఒత్తిడి, రాబడి, పలుకుబడి, నిలకడ, మాంద్యం ప్రభావం, జీవనశైలి వంటి ఏ అంశంలోనైనా సానుకూలత దృష్ట్యా పౌరోహిత్యానిదే విజయం. వీసాపై వచ్చి, అనుభవం గడించి, స్థిరత్వం వచ్చాక సొంత కాళ్లపై స్వతంత్రంగా నిలబడటం కేవలం ఐటీ రంగానికే పరిమితం కాదు. ప్రవాసాంధ్ర అర్చకులదీ ఇదే దారి. ఇరు రంగాలకు సారూప్యత ఉన్నప్పటికీ పౌరోహిత్యం ఒకడుగు ముందుందనడంలో సందేహం లేదు.

* గుడి నుండి సొంత గుడికి

అమెరికాలో సుమారు 450 హిందూ ఆలయాలు ఉన్నాయని ఒక నివేదిక సారాంశం. వీటిలో భారతదేశానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు లేదా పీఠాలకు చెందినవి కొన్ని, పాతతరం ప్రవాసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినవి కొన్ని, అర్చకులుగా అమెరికా వచ్చి సొంతగా ఆలయాలు ఏర్పాటు చేసుకున్నవారివి మరికొన్ని ఉన్నాయి. ఇండియాలో ప్రముఖ పీఠాల్లో లేదా గుర్తింపు పొందిన వేద పాఠశాలలో వేదాధ్యాయనం చేసినవారికి పెద్దపీట వేస్తూ అమెరికాలోని ఆలయాలు ఆర్-1 వీసాపై అర్చకులను అమెరికా తీసుకువస్తున్నారు. వారికి వసతి, బీమా, జీతభత్యాలు వంటి వాటిని కల్పిస్తున్నారు. ఇలా వచ్చిన వారికి ప్రారంభ దశలో డిమాండ్ కొంత తక్కువగా ఉంటుంది. గర్భాలయాల్లో నిలదొక్కుకున్నాక భక్తులతో పరిచయాలు, సత్సంబంధాలు పెంచుకుని వారి విరాళాల సహకారంతో గ్రీన్ కార్డు లేదా వర్క్ పర్మిట్ వచ్చిన దరిమిలా తాము పనిచేసే గుడి వదిలి సొంత గుడి ఏర్పాటు చేసుకుంటున్నారు. దీని ద్వారా గుడిలో వచ్చే జీతభత్యపు ఆదాయం కన్నా ఎన్నో ఇంతలు ఎక్కువ సంపాదిస్తున్నారు. మతపరమైన సంస్థలకు అమెరికా ఆదాయపు పన్ను శాఖ నూరు శాతం పన్ను మినహాయింపు ఇవ్వడం కూడా దీనికి మరింత బలాన్ని చేకూర్చుతోంది. శాన్‌హోశే డౌన్‌టౌన్‌కి 40 కి.మీ. పరిధిలో 200 భారతీయ దేవాలయాలు ఉన్నాయంటే అమెరికాలో అర్చకత్వం ఎంత అద్భుతంగా సాగుతుందో ఊహించుకోవచ్చు.

* జీవనశైలి

అర్చకత్వం అనగానే రాబడి మాత్రమే అనుకుంటే పొరబడినట్లే. దాని వెనుక కఠినమైన చిత్తశుద్ధి, అవిరళ కృషి ఉంది. ఆచార నిష్ఠ, సాంప్రదాయ విలువలు ఉన్నాయి. పూజారి నిష్కల్మషంగా, నియమాలతో ఉండాలని భక్తులు కోరుకుంటున్నారు. మాంసాహారం నిషేధమనేది సహజంగా తెలిసినప్పటికీ అవి వడ్డించే హోటళ్లల్లో వ్యక్తిగత సమావేశాలకు సైతం హాజరుకావడాన్ని భక్తులు ప్రతికూల దృక్పథంతో చూస్తారనే ఎరుకతో అర్చకుల జీవనశైలి ఉంటోంది. పూజాధిక కార్యక్రమాలకు వెళ్లినప్పటికీ ఇంటి భోజనానికే ప్రాధాన్యత ఇస్తూ నిజాయితీగా ఉండే అర్చకులకు భారీ డిమాండ్ ఉంటోంది. కార్తీక మాసంలో ఉదయం రెండున్నరకే లేచి సంధ్య వార్చుకుని మూడున్నరకు పూజలకు బయల్దేరి వెళ్లి రాత్రి పదకొండు గంటలకు తిరిగివచ్చే అర్చకుల డిమాండ్ తలుచుకుంటే ఆశ్చర్యం అనిపించకమానదు. గుట్ఖా ప్రియులు, సెల్‌ఫోన్ బానిసలైన అయ్యవార్లను భక్తులు ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. ఎవరూ దొరకని పక్షంలో అత్యవసరమైతే తప్ప ఇలాంటి వారికి అవకాశం ఇవ్వట్లేదు. చలి దేశమైన అమెరికాలో ఇంత ఘనంగా ఉన్న తెలుగు ఘనాపాఠీల జీవితం జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలతో సున్నితంగా కూడా మారుతుంది. అర్చకత్వానికి ప్రధాన వనరు గొంతుకే కాబట్టి అలాంటి అనారోగ్య పరిస్థితులు ఎదురైన అర్చకులు తమ బంధువులను లేదా మిత్రులను ఆయా కార్యాలకు పంపి భక్తుల వద్ద తమ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు.

* డిమాండ్ తగ్గేదేలే

వాహన పూజలు, గృహప్రవేశం, అన్నప్రాసన, పుట్టు వెంట్రుకలు, సత్యనారాయణ వ్రతం, హోమాలు, యజ్ఞాలు, శాంతి పూజలు, దోష నివారణ పూజలు వంటివి ఏడాది పొడవునా జరుగుతుండటంతో పూజారులకు మాంచి గిరాకీ లభిస్తోంది. మాంద్యం ఉన్నా లేకపోయినా దేవుణ్ణి భక్తుడికి దగ్గరచేసే అయ్యవార్లకు ప్రవాసాంధ్రులు అన్నివేళలా గొడుగుపడుతున్నారు. ఈ డిమాండ్‌ను ఒడిసిపట్టి దీర్ఘకాలం సద్వినియోగం చేసుకోవాలంటే భక్తుల వద్ద నమ్మకాన్ని ప్రోది చేసుకోవడం అర్చకులకు ప్రధాన సవాలుగా ఉంటోంది. తరచుగా తమ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిపించుకునే భక్తులు ఒక్కసారి వేరే అర్చకుడి వద్దకు వెళ్తే తమ ఖాతా ప్రమాదంలో పడినట్లేనని అర్చకులు భావిస్తున్నారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి పరిచయమైన భక్తులను వదులుకునేందుకు అర్చకులు ఇష్టపడట్లేదు. ఏదో రూపేణా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తూ కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు.

* పూజారులు పలు రకాలు

అర్చకుల్లో వారి వారి సమయానుకూలతను అనుసరించి పలురకాలుగా విభజించవచ్చు. ఆర్-1, హెచ్-1, బీ-1/బీ-2 పర్యాటక, ఓపీటీ, ఫుల్-టైమ్, పార్ట్‌టైమ్, ఐటీ, తాజా, సీనియర్..ఇలా ఎన్నో రకాల అర్చకులు అమెరికాలో ఐటీ రంగానికి దీటుగా సంపాదిస్తున్నారు. భార్యా భర్తలు ఇరువురికీ పూర్తి స్థాయి ఐటీ ఉద్యోగం ఉన్నప్పటికీ సాయంకాలం అర్చకత్వం చేసేవారు కొందరు. రిమోట్ హెచ్-1 ఉద్యోగాన్ని ఇతరులకు ఇచ్చేసి నెలనెలా కొంత సొమ్ము తీసుకుంటూ పూర్తి స్థాయి అర్చకత్వంలో ఉన్నవారు కొందరు. పూర్వీకులు అర్చకులు అయినప్పటికీ ఇండియాలో ఏనాడూ అర్చకత్వం చేయకుండా..అమెరికాకు విద్యాభ్యాసానికి వచ్చి ఓపీటీపైన ఉన్న విద్యార్థులు సైతం అర్చకులకు ఉన్న డిమాండ్ చూసి తమ పూర్వీకుల సహకారంతో ఈ వృత్తిలోకి దిగుతున్నారు. పర్యాటక వీసాలపై వచ్చి స్థానిక ఆలయాల్లో తాత్కాలిక అర్చకులుగా కొందరు పనిచేస్తున్నారు. వారాంతల్లో మాత్రమే అర్చకత్వం చేసేవారు కొందరైతే..యూట్యూబ్ చూసి మంత్రాలు, పూజా విధానాలు నేర్చుకుని అర్చకత్వం చేస్తున్నవారు మరికొందరు. సాంకేతికత కూడా అర్చకత్వం బలోపేతం కావడానికి బాగా సహకరిస్తోంది.

* సూపర్ సంభావనలు

సంపాదన పరంగా చూసుకుంటే ఐటీ కన్నా అర్చకత్వంలోనే ఆదాయం ఎక్కువ ఉంటోందని డల్లాస్‌కు చెందిన ఒక ఆలయ నిర్వాహకుడు పేర్కొన్నారు. వాక్‌శుద్ధి కలిగి, మంత్రోచ్ఛారణ బాగున్న వారికి భక్తులు ప్రాధాన్యత ఇస్తున్నారు. తాజా పూజారులకు తక్కువ ఆదాయం ఉంటుండగా సీనియర్లకు భారీ డిమాండ్‌తో పాటు ఆదాయం కూడా అదే రీతిలో ఉంటోంది. సీనియర్ల అపాయింట్మెంట్ల కోసం నెలల తరబడి వెయిట్‌లిస్ట్‌లో కూడా భక్తులు ఎదురుచూపులు చూస్తున్నారు. డల్లాస్‌లో మామూలు రోజుల్లో సత్యనారాయణ స్వామి వ్రత పూజకు కేవలం అర్చకులకు సంభావన రూపంలో మాత్రమే సగటున రూ.20వేల-రూ.30వేల మధ్య ఉంటుండగా కార్తీక మాసం వంటి ప్రత్యేక వేళల్లో రూ.30వేల-రూ.45వేల వరకు తీసుకుంటున్నారు. సమయాన్ని సరిగా సద్వినియోగం చేసుకునే అర్చకులు ఒకరోజులో ఇలాంటి పూజలు రోజుకి మూడు నుండి అయిదు వరకు చేస్తున్నారు. పూజా సామాగ్రి ఇతరత్రా ఖర్చులది సెప"రేటు". ప్రాతఃకాలంలో తంతుకి ఒక ధర, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి, వారాంతం, పనిదినాలు, పనిగంటలు, పౌర్ణమి, అమావాస్య అయితే వివిధ రకాలతో టారిఫ్‌లు ఉన్నాయి. అమెరికావ్యాప్తంగా ఏడాది పొడవునా ఉండే సంపాదన చూస్తే సగటున నెలకు రూ.4లక్షల-రూ.10లక్షల మధ్య అర్చకులు ఆర్జిస్తున్నారు. హుండీలో వేసినా, శఠారి పళ్లెంలో పెట్టినా అది గుడికే వెళ్తుంది. అర్చకులు చేతికి ఇస్తేనే అది వారి సం"భావన". ఆలయంలో అర్చకులుగా పనిచేసే వారు పన్ను కట్టాలి. కానీ సొంత ఆలయాలు ఉన్నవారు ఆలయం ఖాతాలోకి సంభావన తీసుకుంటారు. తద్వారా పన్ను మినహాయింపు లభిస్తుంది. గుడిలో అర్చకుడిగా ఆర్-1 వీసాపై ఉన్న పూజారి ఒక భక్తుడి ఇంట పూజ చేయాలంటే గుడికి కొంత, పూజారికి కొంత ఆలయ వెబ్‌సైట్ ద్వారా చెల్లించాలి. ఇంటికి వచ్చి కార్యం పూర్తి అయ్యాక భక్తుల "సంతోషం" రూపేణా అర్చకులకు భక్తులు మరో మారు ఎంతో కొంత చెల్లిస్తున్నారు. ఇళ్లకు వెళ్లి చేసే ఇలాంటి కార్యక్రమాలకు నగదునే తీసుకుంటున్నారు. అమెరికాలో ఎప్పటి నుండో ఉంటున్నవారు ఇండియాలో విద్యార్థులకు ఆన్‌లైన్‌లో వేదపాఠాలు నేర్పిస్తున్నారు.

* ఇండియాలో పూజలకు అమెరికా అర్చకులు

బే-ఏరియాకు చెందిన ఒక ప్రముఖ అర్చకుడిని ఇటీవల ఇండియాలో జరిగిన ఒక వివాహ తంతుకి బిజినెస్ క్లాసులో స్వదేశానికి తరలించారని సమాచారం. ఆ కుటుంబంలో జరిగే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆయనే ప్రధాన అర్చకుడు కావడం వలన, భక్తులకు ఆయన పట్ల ఉన్న అపార నమ్మకం కారణంగా ఈ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికాలో నమకానికి, నమ్మకానికి ఉన్న బలాన్ని చాటిచెప్తున్నారు.

Tags-Telugu Priests Lifestyle in USA TNILIVE Specials

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles