🕑 Published: April 06, 2026 at 11:03 AM CST
సాంకేతికంగా అభివృద్ధి చెందినా మంచితనం, మానవత్వం, సంస్కారవంతమైన సమాజాభ్యుదయం పుస్తకాలతోనే సాధ్యమవుతుందని ప్రముఖ సాహితీవేత్త, కవి డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం డల్లాస్ పరిసర ప్రాంతమైన మెలీసాలోని యన్.వి.యల్ స్మారక తెలుగు గ్రంథాలయంలో జరిగిన పుస్తక ప్రదాన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. నాటి వేదాల నుండి నేటి రచనల వరకు వెలువడిన గ్రంథాలన్నీ మానవ జీవన వికాసానికి దోహదపడ్డాయన్నారు. గ్రంథాల ప్రాధాన్యతను గురించిన గాడిచర్ల హరిసర్వోత్తమరావు, అయ్యేంకి వెంకట రమణయ్య, పాతూరి నాగభూషణం వంటి పెద్దలు గ్రంథాలయోద్యమాన్ని గ్రామ గ్రామాన విస్తరించి ప్రజల్లో పుస్తక పఠనాభిలాషను పెంచారన్నారు. తెలుగు వారు గర్వంగా చెప్పుకోదగిన వేటపాలెం లైబ్రరీ, రాజమండ్రి గౌతమీ గ్రంథాలయం, గుంటూరు అన్నమయ్య ఆధ్యాత్మిక గ్రంథాలయాల స్ఫూర్తితో అమెరికాలో నలజుల నాగరాజు ఆయన తండ్రి నలజుల వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం స్వగృహంలో తెలుగు లైబ్రరీని నెలకొల్పి పుస్తక సేవ చేస్తున్నందుకు అభినందించారు. తన తండ్రి "కరుణశ్రీ" జంధ్యాల పాపయ్య శాస్త్రి బాల్యం నుండి పుస్తక పఠనం పట్ల ఆసక్తి కల్గించినందునే తాను తెలుగు చదివి, బోధించి, కవిగా రచనలు చేయగలిగానని జయకృష్ణ బాపూజీ తెలిపారు.
కవి డా. బీరం సుందరరావు స్వాగతోపన్యాసంతో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి శుభం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, విద్యావేత్త పొన్నంగి గోపాల్ అధ్యక్షత వహించారు. యన్.వి.యల్ మెమోరియల్ తెలుగు లైబ్రరీ స్థాపనలో తమ ఫౌండేషన్ భాగస్వామిగా ఉన్నందుకు ఆనందంగా ఉన్నారు. రిటైర్డ్ ప్రిన్సిపాల్, ప్రముఖ ఆధ్యాత్మిక గ్రంథకర్త పింగళి పాండురంగారావు ఒంగోలు నుండి ₹10వేల విలువైన స్వీయ రచనలను పంపించారు. వీటిని అతిథులు యన్.వి.యల్ లైబ్రరీ నిర్వాహకుడు నలజుల నాగరాజుకు అందచేశారు. 92 సంవత్సరాల వయసులో స్వంత ఖర్చుతో అమెరికాలోని తెలుగు లైబ్రరీకి పుస్తకాలు పంపిన పాండురంగారావుకి పుస్తకాల పట్ల వున్న గౌరవాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని వక్తలు కొనియాడారు. నాగరాజు సభాముఖంగా పాండురంగారావుకి ధన్యవాదాలు తెలిపారు. కవయిత్రి డా.బల్లూరి ఉమాదేవి తమ స్వీయ రచనలను లైబ్రరీకి బహూకరించి ప్రసంగించారు. రచయిత్రి సింధుమాధురి తమ వద్ద వున్న 2వేలకుపైగా విలువైన పుస్తకాలను యాన్.వి.యల్ లైబ్రరీకి బహూకరిస్తానని ప్రకటించారు. శుభం ఫౌండేషన్ డైరెక్టర్ విజయ్ తడపనేని, తానా ప్రతినిధి మల్లి వేమన, వైద్యులు డా. విజయ్ కఠారి, డా. ఫణి, జంధ్యాల శ్రీనాథ్, రిటైర్డ్ హెడ్మాష్టర్ పురుషోత్తమ రెడ్డి, భరత్, వెంకట్ చెరుకూరి, అవనీంద్ర లింగా, కిరణ్ మువ్వా, సునీత, గణేష్, గాయత్రి, కవిత, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.





