🕑 Published: April 01, 2026 at 09:12 AM CST
* విశ్వరహస్యాలను అద్భుత చిత్రాలుగా మారుస్తున్న శాస్త్రవేత్త
* కోట్ల కాంతి సంవత్సరాల ఆవల ఉన్న గెలాక్సీల 3డీ మ్యాప్‌ను రూపొందించడంలో కీలకపాత్ర
* అందుకు గుర్తింపుగా గ్రహశకలానికి సుబ్బారావుగా నామకరణం
* బుధవారం నాడు ఆర్టెమిస్-2 ప్రయోగం
* ఆర్టెమిస్-2 వ్యోమగాములకు శిక్షణనిస్తున్న మార్క్ బృందం
---
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ "నాసా"లో తెలుగు మూలాలు కలిగిన శాస్త్రవేత్త డాక్టర్.ఉపాధ్యాయుల మార్క్ సుబ్బారావుది ప్రత్యేకమైన బాధ్యత. ఆయన నాసా సైంటిఫిక్ విషువలైజేషన్ స్టూడియోకు సారథ్యం వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన ఆధ్వర్యంలోని బృందం అనంత విశ్వంలోకి నాసా సంధించిన ప్రయోగాల నుండి వచ్చే సంక్లిష్టమైన శాస్త్ర-సాంకేతిక సమాచారాన్ని క్రోఢీకరించి సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా అందమైన చిత్రాలు, యానిమేషన్లుగా రూపొందిస్తున్నారు. విశ్వ రహస్యాలను మన కళ్ల ముందు అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు. చంద్రమండల అధ్యయనానికి 54 ఏళ్ల అనంతరం బుధవారం(అమెరికా కాలమానం ప్రకారం) నాడు అమెరికా చేపట్టనున్న మానవసహిత రాకెట్ ప్రయోగం "ఆర్టెమిస్-2"లో పాల్గొంటున్న వ్యోమగాములకు మార్క్ నేతృత్వంలోని బృందం పలు అంశాలపై తర్ఫీదును ఇస్తోంది. ఈ సందర్భంగా ఆయన TNILIVEతో ప్రత్యేకంగా ముచ్చటించారు.
* టీవీలు, పుస్తకాల నుండి ప్రేరణ
మార్క్ సుబ్బారావు నార్త్ కరోలీనా రాష్ట్రం షార్లెట్‌లో ఉపాధ్యాయుల సుబ్బారావు-రెజీనా దంపతులకు జన్మించారు. అనంతరం న్యూజెర్సీలోని మోరిస్‌టౌన్‌లో హైస్కూల్ పూర్తి చేశారు. తండ్రి ఫిజిసిస్ట్ కావడం బాల్యంలో ఇంట్లో శాస్త్రీయ వాతావరణం ఉండేదని..టీవీ కార్యక్రమాల ద్వారా తనకు కూడా ఫిజిక్స్ పట్ల మరింత ఆసక్తి కలిగిందని మార్క్ తెలిపారు. హైస్కూల్ సమయంలో కార్ల్ సాగన్ "కాస్మోస్", ఆర్థర్ క్లార్క్ "ఏ స్పేస్ ఆడిస్సీ" వంటి సైన్స్ ఫిక్షన్ పుస్తకాలు తనలో ఖగోళ శాస్త్రం వైపు ఆసక్తిని పెంపొందించాయని గుర్తుచేశారు.
* బేస్‌బాల్ జట్టు పొమ్మంది. భౌతిక శాస్త్రం రమ్మంది.
పాఠశాల దశలో బేస్‌బాల్‌పై ఆసక్తి ఉన్నప్పటికీ మార్క్‌కు జట్టులో చోటు దొరక్కపోవడంతో ఖగోళ శాస్త్రం వైపు వెళ్లాలని నిశ్చయించుకుని పట్టుదలగా సాగారు. తండ్రి సూచనతో పీహెచ్‌డీ చేయాలని నిర్ణయించుకొని పెన్సిల్వేనియాలోని లీహై యూనివర్శిటీ నుండి ఇంజినీరింగ్ ఫిజిక్స్‌లో బ్యాచిలర్స్, మేరీల్యాండ్‌లోని ప్రఖ్యాత జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ నుండి 1996లో యాస్ట్రోఫిజిక్స్‌లో గెలాక్సీల పరిణామక్రమంపై అధ్యయనం చేసి పీహెచ్‌డీ సంపాదించారు. అనంతరం యూనివర్శిటీ ఆఫ్ చికాగోలో పోస్ట్-డాక్‌గా జేరి విశ్వంలోని గెలాక్సీల 3డీ మ్యాప్ రూపకల్పనకు ఏర్పాటు చేసిన "స్లోన్ డిజిటల్ స్కై సర్వే" ప్రాజెక్టులో కీలక పాత్ర పోషించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ కెమెరాలు, ఆప్టికల్ ఫైబర్లు, స్పెక్ట్రోగ్రాఫ్‌లను ఉపయోగిస్తూ 1999 నుంచి 2009 మధ్య విస్తృతంగా పరిశోధనలు నిర్వహించారు. ఇదే ఆయన కెరీర్‌ను కీలక మలుపు తిప్పింది.
* ఏమిటీ స్లోన్ డిజిటల్ స్కై సర్వే?
విశ్వంలో గెలాక్సీలు ఎంత దూరంలో ఉన్నాయో తెలుసుకోవడం శాస్త్రవేత్తలకు ఎప్పటి నుంచో పెద్ద సవాలుగా ఉంది. కానీ కాంతి విశ్లేషణ సాయంతో ఈ రహస్యాన్ని చేధించగలుగుతున్నారు. తద్వారా 3డీ మ్యాపును తయారు చేశారు. నక్షత్రాలు, గెలాక్సీలలో కాల్షియం, హైడ్రోజన్, ఆక్సిజన్ వంటి మూలకాలు ఉంటాయి. ఈ మూలకాలు తమకే ప్రత్యేకమైన వేవ్‌లెంత్‌లో కాంతిని విడుదల చేయడమో గ్రహించడమో చేస్తాయి. కాంతిని స్పెక్ట్రంగా విభజించినప్పుడు ఇవి చీకటి లేదా వెలుతురు గీతలుగా కనిపిస్తాయి. వీటిని స్పెక్ట్రల్ లైన్స్ అంటారు. ఇవి ఆయా మూలకాల వేలిముద్రల్లా పనిచేసి, గెలాక్సీలలో ఏ మూలకాలు ఉన్నాయో చెప్పగలవు. స్పెక్ట్రల్ లైన్స్ తమ సాధారణ స్థానం నుంచి ఎంత మేర జరిగాయో కొలిచి..దాన్ని వేవ్‌లెంగ్త్ స్ట్రెచ్ ఫ్యాక్టర్ అంటారు. ఈ విలువ ఆధారంగా ఒక గెలాక్సీ ఎంత దూరంలో ఉందో లెక్కించవచ్చు. రెండు గెలాక్సీల స్ట్రెచ్ ఫ్యాక్టర్లు ఆధారంగా వాటి మధ్య దూరాన్ని అంచనా వేస్తారు. ఉదాహరణకు ఒక బెలూన్ పై రెండు చుక్కలు గీసి బెలూన్ ఊదే కొద్దీ ఆ చుక్కలు ఒకదానికొకటి దూరమవుతాయి. ఇదే విధంగా విశ్వం విస్తరించడంతో గెలాక్సీల నుండి వెలువడే కాంతి కూడా సాగదీయబడుతుంది. ఈ సాగదీయడం ఎంత ఎక్కువగా ఉంటే, ఆ గెలాక్సీ అంత దూరంగా ఉందని అంచనా వేస్తారు. అంతరిక్షంలో వాతావరణం లేకపోవడం వల్ల కాంతి చెదిరిపోకుండా పయనిస్తుంది. దీనివల్ల ఈ కొలతలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ విధంగా స్పెక్ట్రోస్కోపీ సూత్రాలను ఉపయోగించి అత్యాధునిక డిజిటల్ కెమెరాల సాయంతో కోట్ల కాంతి సంవత్సరాల ఆవల ఉన్న గెలాక్సీల 3డీ మ్యాప్‌ను రూపొందించడంలో మార్క్ కీలకంగా వ్యవహరించారు.
ఈ పరిశోధనలో భాగంగా ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఆయన పేరుమీదుగా గ్రహశకలానికి "170009 Subbarao"గా నామకరణం చేశారు. స్లోన్ సర్వే అనుభవంతో డిజిటల్ టెక్నాలజీని ఆకళింపు చేసుకున్న మార్క్...దాన్ని చికాగోలోని ఆడ్లర్ ప్లానెటోరియం ప్రదర్శనల్లో వినియోగించడంలో ప్రధాన భూమిక పోషించారు. ఈ ప్లానెటోరియంలో 18ఏళ్లు సేవలందించిన ఆయన ప్లానెటోరియంలో కేవలం నక్షత్రాల ప్రదర్శన మాత్రమే గాక గెలాక్సీలు, కాస్మాలజీ, అంతరిక్షం, ఖగోళ శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికర అంశాలను డిజిటల్ ప్రొజెక్షన్ ద్వారా ప్రదర్శనల్లో ఏర్పాటు చేశారు. ఈ సమయంలోనే ఆయన అంతర్జాతీయ ప్లానెటోరియం సొసైటీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ప్రపంచవ్యాప్తంగా ఖగోళ ప్రదర్శనశాలల్లో డిజిటల్ టెక్నాలజీ అభివృద్ధికి చేయూతనందించారు. "డేటా టు డోమ్" ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఖగోళ సంబంధ శాస్త్రీయ డేటాను ప్లానెటోరియం గోపురాలపై ప్రదర్శించడానికి ఈ కార్యక్రమం దోహదపడింది. 2019లో హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ ప్లానెటేరియం సమావేశంలో కూడా పాల్గొని ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చారు.
* నాసాలో ప్రస్తుత బాధ్యతలు
డిసెంబర్ 2020లో డాక్టర్ మార్క్ సుబ్బారావు మేరీల్యాండ్‌లోని నాసా గోడార్డ్ స్పేస్ ఫ్లైట్ సెంటర్లో సైంటిఫిక్ విషువలైజేషన్ స్టూడియో సారథిగా చేరారు. ఆయన బృందం నాసా ఉపగ్రహాల నుండి, సూపర్ కంప్యూటర్ల నుండి వచ్చిన డేటాను ఉపయోగించి అద్భుతమైన వీడియోలు, చిత్రాలను రూపొందించి శాస్త్రీయ సమాచారాన్ని సాధారణ ప్రజలకు చేరువ చేస్తున్నారు. కంప్యూటర్ సైన్స్, గణితం, కళలు, కథనం, ఛాయాచిత్ర రంగాలకు చెందిన ప్రతిభావంతులు ఈ బృందంలో పనిచేస్తున్నారు. తమ పనిని వీరంతా కళ, శాస్త్రాల సమ్మేళనంగా అభివర్ణిస్తున్నారు. సంక్లిష్ట డేటాను అందమైన చిత్రాలుగా మార్చడం వల్ల శాస్త్రాన్ని అర్థం చేసుకోవడం సులభమవుతుందని వీరు నమ్ముతున్నారు. సైన్స్ ఫలితాలను సులభంగా వివరించలేకపోతే అది పరిపూర్ణత కాదని మార్క్ అన్నారు. పైథాన్, హౌడీనీ, వీఎఫెక్స్ వంటి సాంకేతికతను విరివిగా వినియోగిస్తున్నారు. అధునాతన సర్వర్ల ద్వారా భారీ డేటాను వేగంగా ప్రాసెస్ చేసి విజువలైజేషన్లు రూపొందిస్తున్నారు. భూమి సగటు ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతున్న తీరును 2023లో మార్క్ "క్లైమేట్ స్పైరల్" అనే వీడియో రూపంలో సృష్టించి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ప్రజలకు ఉష్ణోగ్రత పెరిగిందని చెప్పడమే కాకుండా, దాన్ని వారు అర్థం చేసుకునేందుకు ఆ వీడియో రూపొందించినట్లు మార్క్ వివరించారు.
* ఆర్టెమిస్-2 వ్యోమగాములకు శిక్షణ
అమెరికా చివరిసారిగా 1972లో అపోలో17 మిషన్ ద్వారా మానవులను చంద్రుని మీదకు పంపింది. 54 ఏళ్ల అనంతరం బుధవారం నాడు అమెరికా మరోసారి మానవసహిత రాకెట్‌ను చంద్రుని మీదకు ప్రయోగించనుంది. ఆర్టెమిస్-2గా పిలవబడుతున్న ఈ మిషన్ చాలా ప్రత్యేకమైనది. భూమిపై నుండి కనపడని చంద్రుని ఆవలి వైపుకు(ఫార్‌సైడ్) మానవసహిత రోదసి యాత్ర ఇదే ప్రప్రథమం. చైనా ఇప్పటికీ ఫార్‌సైడ్‌పై తన రోవర్లు ఏర్పాటు చేసినప్పటికీ మానవులు ఎవరూ ఇప్పటి వరకు అటువైపుకు వెళ్లలేదు. అందుకే ఆర్టెమిస్-2 ప్రయోగం చంద్రమండల అధ్యయనంలో కీలకంగా వ్యవహరించనుంది. భవిష్యత్తులో మానవులకు చంద్రుడి మీద నివాసం ఏర్పాటు చేయాలంటే అక్కడ పరిస్థితులను విశ్లేషించాలి. అంతరిక్షంలో జీవన సౌకర్యాలు, రాకెట్ పనితీరు వంటి పలు అంశాలను అర్థం చేసుకునేందుకు ఆర్టెమిస్-2 ప్రయోగం దోహదపడనుంది. ఈ యాత్రలో పాల్గొనే వ్యోమగాములు మొదటిసారిగా చంద్రుడి చుట్టూ తిరిగి భూమి పైకి సుమారు గంటకు 40వేల కిలోమీటర్ల వేగంతో తిరిగి వస్తారు. ప్రస్తుతం ఆర్టెమిస్-2 మిషన్ కోసం వ్యోమగాములకు మార్క్ నేతృత్వంలోని బృందం ఫోటోగ్రఫీ శిక్షణ ఇస్తున్నారు. చంద్రుడి ఫార్‌సైడ్ అధ్యయనానికి ఎలాంటి చిత్రాలు తీయాలి, సంబంధిత సమాచార సేకరణ, భూమిపైకి దాని బదిలీ వంటి కీలకాంశాలపై వ్యోమగాములకు తర్ఫీదును ఇస్తున్నట్లు మార్క్ తెలిపారు. సూర్యమండల అధ్యయనానికి నాసా ప్రయోగించిన పార్కర్ సోలర్ ప్రోబ్ సేకరించిన సమాచారాన్ని కూడా మార్క్ సారథ్యంలోని స్టూడియో విశ్లేషిస్తోంది. పార్కర్ సోలార్ ప్రోబ్ ద్వారా సూర్యుడి కరోనాలో గమనించిన డేటా భూమిపై సౌర తుఫాన్లు, ఉపగ్రహాలు, విద్యుత్ వ్యవస్థలపై ప్రభావాలను అర్థం చేసుకోవడంలో కీలకమని ఆయన అన్నారు.
* కృత్రిమ మేథస్సు-గ్రహాంతర వాసులు
అంతరిక్ష సమాచార విశ్లేషణలో ఏఐ వినియోగంపై మార్క్ మాట్లాడుతూ నాసాలో ఇప్పటికే తమ సొంత మోడళ్ల ఆధారంగా CHATGSFC పేరిట కృత్రిమ మేథస్సు వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నామని వివరించారు. దీన్ని ఉపయోగించి కోడింగ్ వేగవంతం చేయడం, చిత్రాల పరిమాణాన్ని నాణ్యత కోల్పోకుండా తగ్గించడం వంటివాటికి వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. కేవలం నాసా ప్రయోగాల నుండి వచ్చే సమాచారం ఆధారంగా మాత్రమే తాము వీడియోలు, యానిమేషన్లు, చిత్రాలు రూపొందిస్తామని స్పష్టతనిచ్చారు. ఏఐను పూర్తిగా విశ్వసించి చిత్రాలు తయారు చేయకూడదని, కేవలం ప్రక్రియను మెరుగుపరచడానికి మాత్రమే ఉపయోగించాలనే జాగ్రత్త అవసరమని సూచించారు. తాను గ్రహాంతరవాసులకు సంబంధించిన ప్రాజెక్టులు లేదా సమాచారంపై ఇప్పటివరకు పని చేయలేదని తెలిపారు.
* ఆకళింపు చేసుకుంటేనే విజయం
తాను ఖగోళ శాస్త్రం వైపు వెళ్లాలని హైస్కూల్‌లో నిర్ణయించుకుని ఆ దిశగా కృషి చేసి విజ్ఞాన సముపార్జన చేసినప్పటికీ ఇతర రంగాలతో తాను అనుసంధానం కావడం వలనే విజయాలు అందుకున్నానని మార్క్ అన్నారు. మనలోని ఆసక్తిని ప్రోది చేసుకుంటూ ఆస్వాదించాలని అన్నింటినీ క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఆకళింపు చేసుకుంటేనే సక్సెస్ లభిస్తుందన్నారు. ప్రతిభావంతులు విజయాలు అందుకోలేరని కేవలం తమ చుట్టూ ఉన్న వాతావరణానికి తమను తాము సమన్వయం చేసుకుంటేనే ఎక్కడైనా రాణించగలరని వివరించారు. ఈ డిజిటల్ యుగంలో ఒకే విభాగంలో కాకుండా రచన, కమ్యూనికేషన్, కళలు వంటి విభిన్న నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. నాసా లాంటి సంస్థల్లోకి ప్రవేశించాలన్నా, రాణించాలన్నా మనల్ని మనం ప్రతిరోజు కొత్తగా ఆవిష్కరించుకోవల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వ్యక్తిగతంగా తన కుటుంబం గురించి మాట్లాడుతూ, తన ఇద్దరు కుమారులు కూడా టెక్నాలజీ రంగంలోనే ఉన్నారని తెలిపారు. ఒకరు మెడికల్ డేటా విజువలైజేషన్‌లో, మరొకరు ఏఐ సేఫ్టీపై పనిచేస్తున్నారని తెలిపారు. భారతదేశంతో పాటు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో తనకు అనుబంధం ఉందని మార్క్ అన్నారు. అప్పుడప్పుడు తన తండ్రితో కలిసి తెలుగు సినిమాలు చూస్తుంటానని వెల్లడించారు. అంతర్జాతీయ స్థాయిలో అంతరిక్ష శాస్త్రంపై ఆసక్తి పెరుగుతున్న దేశల్లో భారత్ కూడా ఒకటిగా నిలవడం పట్ల ఆయన హర్షం వెలిబుచ్చారు.
* తెలుగు రాష్ట్రాలతో అనుబంధం
మార్క్ తండ్రి ఉపాధ్యాయుల సుబ్బారావు 1941 ఆగస్టు 20న ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో జనించారు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలోని అనిశ్చిత పరిస్థితుల్లో 1942లో సికింద్రబాద్ చేరిన ఆయన బాల్యం నాగపూర్, జబల్‌పూర్, ఎర్నాకుళం వంటి ప్రాంతాల్లో సాగింది. బోలారం హైస్కూల్‌లో చదువుతూ పుస్తకాలపై ఆసక్తి పెంచుకుని, పాఠశాలలో లైబ్రరీ ఏర్పాటుకు స్వయంగా కృషి చేశారు. ముంబైలోని సిద్ధార్థ కాలేజీ నుండి 1961లో ఫిజిక్స్‌లో ఎమ్మెస్సీ, స్టాటిస్టిక్స్‌లో బీఎస్సీ పట్టా అందుకున్నారు. సెయింట్ జేవియర్స్‌లో కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశాక 1962లో అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రం ట్రాయ్‌లోని రెన్‌సీలర్ పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్‌లో పీహెచ్‌డీ చదివేందుకు వచ్చారు. ప్రారంభంలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ పట్టుదలతో ముందుకు సాగారు.
1963లో ఎయిర్ రిడక్షన్ కంపెనీ(ఎయిర్‌కో)లో జూనియర్ ఇంజనీర్‌గా ఏడాదికి 8వేల డాలర్ల జీతానికి చేరి లేజర్ టెక్నాలజీపై కీలక పరిశోధనలు చేశారు. ఈ ఉద్యోగ ఇంటర్వ్యూకి మంచు తుఫానులో ప్రయాణించానని 2గంటలు ఆలస్యంగా వెళ్లినప్పటికీ తనలోని పట్టుదల చూసి ఉద్యోగం ఇచ్చారని మార్క్ తండ్రి సుబ్బారావు తెలిపారు. 1998లో ఇండియాకు చివరిసారిగా వచ్చానని ఆయన వెల్లడించారు. తమ కుటుంబసభ్యులు ఇప్పటికీ మల్కాజ్‌గిరి ప్రాంతంలో నివసిస్తున్నట్లు పేర్కొన్నారు. కంప్యూటర్ సైన్సెస్ కార్పోరేషన్ వంటి సంస్థలతో పాటు టెక్స్టైల్ మిల్స్, ఫెడరల్ గవర్నమెంట్ ప్రాజెక్టులు, టైమ్‌షేరింగ్ టెక్నాలజీ రంగాల్లో విశేష అనుభవం సంపాదించారు. అనంతరం ఒక ఫార్మాస్యూటికల్ సంస్థలో ఆపరేషన్స్ రీసెర్చ్ మేనేజర్‌గా చేరి దాదాపు 19 సంవత్సరాల పాటు సేవలందిస్తూ డైరెక్టర్ స్థాయికి ఎదిగారు. 1966లో రెజీనాను వివాహం చేసుకున్నారు.







