🕑 Published: March 29, 2026 at 10:41 AM CST
జపాన్‌లోని టోక్యో నగరం నిషిఓజిమ వేదికగా శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాజ్ - తెలుగు అసోసియేషన్ ఆఫ్ జపాన్(TAJ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్థానిక ప్రవాస తెలుగు ప్రజలు, భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శ్రీసీతారాముల కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు శ్రద్ధగా ఈ పూజలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. కార్యక్రమం అనంతరం విచ్చేసిన భక్తులందరికీ ప్రత్యేకంగా ప్రసాద వితరణ, సాంప్రదాయ భోజనాన్ని అందించారు. తెలుగు పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా వేడుక సాగింది. కార్యక్రమ విజయానికి సహకరించిన వారికి తాజ్ కార్యవర్గం ధన్యవాదాలు తెలిపింది.

