🕑 Published: April 05, 2026 at 12:03 PM CST
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి, ఒంటిమిట్ట శ్రీకోదండరామ స్వామి తరహాలో ఒమాన్‌లో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. యుద్ధ ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ శుక్రవారం వేయి కిలోమీటర్ల దూరంలోని సలాల, సోహార్, ఇబ్రి ఎడారి ప్రాంతాల నుండి కూడా వందల సంఖ్యలో భక్తులు మస్కట్‌కు తరలి వచ్చి శ్రీ కృష్ణ మందిర ఆవరణలో జరిగిన ఈ కల్యాణోత్సవాన్ని తన్మయత్వంతో తిలకించారు. స్థానిక ప్రవాసీ, ప్రముఖ వేద పండితులు విజయకుమార్ ఆధ్వర్యంలో పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల మధ్య కన్నులపండువగా కార్యక్రమం కొనసాగింది. భారత రాయబారి జీవీ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొనడమే కాకుండా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. యుద్ధ పరిస్థితుల్లో అనేక ఆంక్షలు ఉన్నప్పటికీ ఒమానీ ప్రభుత్వం తమకు కల్యాణం నిర్వహించుకోవడానికి అనుమతించినందుకు కల్యాణోత్సవ ముఖ్య నిర్వాహకులలో ఒకరైన చందక రాందాస్ కృతజ్ఞతలు తెలిపారు.
