🕑 Published: April 03, 2026 at 11:13 AM CST
ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) మిడ్ అట్లాంటిక్ విభాగం ఆధ్వర్యంలో పరాభవ నామ ఉగాది వేడుకలను పెన్సిల్వేనియాలోని వెస్ట్ చెస్టర్ ఈస్ట్ హైస్కూల్లో వైభవంగా నిర్వహించారు. ప్రార్థనతో కార్యక్రమాలను ప్రారంభించారు. సంప్రదాయమైన ఉగాది పంచాంగ శ్రవణం చేశారు. ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. స్థానిక కళాకారుల నృత్య ప్రదర్శనలు, ఇండియన్ ఐడల్ స్టార్ అనిరుధ్ సుస్వరం సంగీత విభావరి ఆకట్టుకుంది. తానా ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ కె.పి. సోంపల్లి పౌరాణిక ఏకపాత్రాభినయం ఆకట్టుకుంది.
స్పాన్సర్లు డాక్టర్.నాయుడు,డాక్టర్ ప్రమీల మోటుపల్లి, తిరుమల్ మునుకుంట్ల, సుబ్రహ్మణ్యం ఒసూరు, రామకృష్ణ తాడిసెట్టి, నిధుల సేకరణలో చురుగ్గా పాల్గొన్న తానా మిడ్ అట్లాంటిక్ గర్ల్స్ క్లబ్ కు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. వ్యాఖ్యాతగా శ్వేత కొమ్మోజి రక్తి కట్టించారు. తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరి మాట్లాడుతూ తెలుగు సంప్రదాయాలను గుర్తుకు తెచ్చేలా ఉగాది వేడుక కార్యక్రమాన్ని నిర్వహించిన మిడ్ అట్లాంటిక్ టీమ్‌ను అభినందించారు. తానా కోశాధికారి రాజా కసుకుర్తి, న్యూజెర్సీ ప్రాంతీయ ప్రతినిధి సుధీర్ నరెపాలేపు, న్యూయార్క్ ప్రాంతీయ ప్రతినిధి శ్రీనివాస్ భర్తవరపు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. చెస్ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ట్రోఫీలను అందజేశారు. తానా మిడ్ అట్లాంటిక్ ప్రాంతీయ ప్రతినిధి ఫణి కంతేటి, తానా బెనిఫిట్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు, సతీష్ తుమ్మలలు సంబరాలను సమన్వయపరిచారు. అరవింద్ నాగిళ్ల ఫోటోగ్రఫీ సహకారం అందించారు.







