🕑 Published: March 31, 2026 at 09:10 AM CST
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం, టాంటెక్స్ సాహిత్య వేదిక నిర్వహించిన “నెల నెలా తెలుగువెన్నెల” 224వ సాహిత్య సదస్సు 2026 గత ఆదివారం అంతర్జాలంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న షాడో మధుబాబు ప్రసంగం సాహిత్య ప్రియులను ఆకట్టుకుంది. సాహిత్యవేదిక సమన్వయకర్త దయాకర్ మాడా స్వాగత ప్రసంగంతో ప్రారంభించారు. ముఖ్య అతిథి షాడో మధుబాబు జీవితం, రచనా ప్రయాణం గురించి ఆయన పరిచయం చేశారు. జూమ్ ద్వారా పాల్గొన్న వల్లూరు మధుసూదన రావు తన రచనా అనుభవాలను పంచుకున్నారు. తనకు ముందున్న విశ్వనాధ సత్యనారాయణ, అడవి బాపిరాజు, నోరి నరసింహ శాస్త్రి రచనలు, శరత్ సాహిత్యం, ఆంగ్ల సాహిత్యం, కాశి మజిలీ కథలు, జానపద కథలు రచయితగా తన ఎదుగుదలకు దోహదపడ్డాయని తెలిపారు.
షాడో మధుబాబు తన ప్రసంగంలో గత అరవై సంవత్సరాలుగా రచనలు కొనసాగిస్తున్నానని, “డిటెక్టివ్ షాడో” సృష్టికర్తగా పాఠకుల ఆదరణ పొందినట్లు పేర్కొన్నారు. డిటెక్టివ్ నవలల యుగం తగ్గిన తర్వాత జానపద నవలల రచనను కొనసాగిస్తూ పత్రికా పాఠకులకు చేరువయ్యానని చెప్పారు. తుదిశ్వాస వరకు రచనలు చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. రచయితకు అధ్యయనం, అభ్యాసం, ఊహాశక్తి అవసరమని చెప్పారు. దయాకర్ మాడా అడిగిన ప్రశ్నలకు సమగ్రంగా సమాధానాలు ఇచ్చారు.
ఈ సమావేశంలో డాక్టర్ బీరం సుందరావు “సాహిత్యంలో చమత్కారాలు” అంశంపై మాట్లాడారు. త్యాగరాజు పద్యాలు ఆలపించారు. మాధవి లోకిరెడ్డి జూమ్ ద్వారా మాట్లాడుతూ మధుబాబు రచనలను ప్రశంసించారు. అక్కిరాజు సుందర రామకృష్ణ పద్యాలు వినిపించారు. డాక్టర్ తోటకూర ప్రసాద్, ప్రొఫెసర్ డాక్టర్ పూదూరు జగదీశ్వరన్, డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, లెనిన్ వేముల, సతీష్ బండారు, కిరణ్ నిడిగంటి, పవన్ నర్రా, లెనిన్ బందా, ఎస్.కె.ఎస్. రాజు, రామ్ డొక్కా, డాక్టర్ బల్లూరి ఉమాదేవి, చంద్రహాస్ మద్దుకూరి, అనంత్ మల్లవరపు, చిన్న సత్యం వీర్నపు, చంద్ర కాటుబోయిన, హరి సింగం, నవీన్ గొడవర్తి, నిడిగంటి గోవర్ధన రావు తదితరులు పాల్గొన్నారు.



