🕑 Published: July 07, 2026 at 09:17 AM CST
విదేశాల్లోని తెలుగుదేశం శ్రేణులు సుదీర్ఘకాలం పాటు ఎదురుచూసిన వివిధ కమిటీల నియామకాలను ఏపీ సర్కారు దాదాపు పూర్తి చేసింది. విదేశాల్లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులుగా నలుగురు ప్రవాసాంధ్రులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ సలహాదారులుగా ప్రత్యేక జీతభత్యాలు, గౌరవమర్యాదలు వీరికి ఉంటాయి. ప్రవాసాంధ్రులు ఎక్కువగా ఉన్న మధ్యప్రాచ్య అరబ్బు దేశాలు, ఆగ్నేయ ఆసియా దేశాలకు రావి రాధాకృష్ణ, ఐరోపా దేశాలకు జయకుమార్ గుంటుపల్లి, ప్రపంచంలోని మిగిలిన దేశాలకు శ్రీనివాస్ పల్లపోటులు ప్రత్యేక ప్రతినిధిలుగా నియమితులయ్యారు. వీరితో పాటు ఉత్తర అమెరికాలో పెట్టుబడుల వ్యవహారాల సమన్వయకర్తగా సతీష్ మండువ నియమితులయ్యారు.
చమురు ఉత్పత్తిలో ప్రపంచ అగ్రగామి అయిన సౌదీ అరేబియాలో ఆయిల్, గ్యాస్ రంగంలో వ్యాపారం చేసే రాధాకృష్ణ స్వస్థలం కోనసీమ జిల్లా సఖీనేటిపల్లి మండలం. ఐరోపా ఖండంలో ప్రభుత్వ ప్రతినిధిగా నియమితులైన జయకుమార్ గుంటుపల్లి స్వస్థలం కృష్ణా జిల్లా మచిలీపట్నం. లండన్ లోని బ్రిటన్ తెలుగు సంఘానికి రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా పని చేసిన ఆయన దశాబ్ద కాలానికి పైగా తెలుగుదేశం కార్యకలాపాల్లో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. ఆఫ్రికా, ఆస్ట్రేలియా సహా ఇతరులకు కేటాయించని అన్ని దేశాలకు ఆస్ట్రేలియాలో నివసించే పల్లపోతు శ్రీనివాస రావును ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. గుడివాడకు చెందిన ఆయన తన బాల్యం నుంచి టీడీపీ అభిమాని. అమెరికాలో పెట్టుబడుల వ్యవహారాలకు లయజన్ ఆఫీసర్‌గా నియమితులైన సతీష్ మండువది ప్రకాశం జిల్లా, అమెరికాలో మూడు దశాబ్దాలకు పైగా సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్న ఆయనకు తెలుగుదేశం పార్టీలో చురుకైన నాయకుడిగా పేరుంది.
