🕑 Published: July 10, 2026 at 05:24 PM CST
శంకర నేత్రాలయ సంస్థ అమెరికా విభాగ సలహా మండలి సభ్యుడిగా లక్ష్మీనరసింహన్ వాసన్‌ను నియమించారు. ఈ మేరకు ఆ సంస్థ అధ్యక్షుడు బాలరెడ్డి ఇందుర్తి తెలిపారు. లాస్ఏంజెల్స్‌కు చెందిన లక్ష్మీనరసిమ్హన్ తమిళనాడులోని ఈరోడ్ సమీపంలోని పసూర్ గ్రామంలో జన్మించి, హైదరాబాద్‌లో పెరిగారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంజినీరింగ్ పట్టా పొందిన అనంతరం 1981లో ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లారు. విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఎదిగి దక్షిణ కాలిఫోర్నియాలోని రాయల్ కిచెన్ ఎక్విప్‌మెంట్ కంపెనీ ప్రధాన కార్యనిర్వాహణ అధికారిగా సేవలందించారు. భారతదేశంలో ఫస్ట్ క్లాస్ క్రికెటర్‌గా రాణించి హైదరాబాద్ రంజీ ట్రోఫీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆయన నాయకత్వంలోని జట్టులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి, మహ్మద్ అజహరుద్దీన్, శివలాల్ యాదవ్ వంటి ప్రముఖ ఆటగాళ్లు సభ్యులుగా ఉన్నారు. శంకర నేత్రాలయ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ గిరీష్ రావు లక్ష్మీనరసింహన్ నియామకం పట్ల హర్షం తెలిపారు.
లక్ష్మీనరసింహన్-డా. బృందా సుబ్రమణ్యం దంపతులు ఇటీవలే శంకర నేత్రాలయ సంస్థకు నాలుగులక్షల ఇరవైఐదు వేల డాలర్ల విరాళం ప్రకటించారు. ఈ విరాళంతో శంకరనేత్రాలయ సంస్థ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ప్రాంతంలో పూర్తిస్థాయి సౌకర్యాలతో కూడిన మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల మధ్యప్రదేశ్ మరియు సమీప ఐదు రాష్ట్రాల పేదప్రజలకు కంటిచూపు సంబందించిన వ్యాధుల నివారణకు సహాయపడుతుంది. ఈ యూనిట్ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్య సేవలు మరింత విస్తృతంగా అందించే అవకాశం కల్పిస్తుంది.
శంకర నేత్రాలయ యూఎస్ఏ వ్యవస్థాపకుడు ఎస్.వి.ఆచార్య, పద్మభూషణ్ డాక్టర్ జగదీశ్ సేథ్ గారు, ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డి, లీల కృష్ణమూర్తి, డాక్టర్ రాజ్ మోదీ, డాక్టర్ కిశోర్ చివుకుల, ఉదయభాస్కర్ గంటి, శ్యామ్ అప్పలి, మూర్తి రేకపల్లి, వంశీకృష్ణ ఏరువరం, డాక్టర్ యు.ఎన్.రెడ్డి లక్ష్మీనరసిమ్హన్‌కు అభినందనలు తెలిపారు.

