🕑 Published: July 11, 2026 at 10:36 PM CST
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డా.వై.ఎస్.రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను డల్లాస్ పరిసర ప్రాంతమైన ప్లేనోలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎన్నారై వైకాపా శ్రేణులు, వై.ఎస్. కుటుంబ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని కేక్ కోసి జోహార్ వై.ఎస్. నినాదాలతో ఘననివాళి అర్పించారు.
వైకాపా ఎన్నారై విభాగ సమన్వయకర్త ఆలూరు సాంబశివారెడ్డి వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. సర్వజనహితమైన ప్రభుత్వ కార్యక్రమాల రూపకల్పనకు ఆజ్యం పోసిన నాయకుడు వై.ఎస్ అని పేర్కొన్నారు. విద్య(ఫీజు రీ-ఎంబర్స్‌మెంట్), వైద్య(ఆరోగ్యశ్రీ), వ్యవసాయం(రుణమాఫీ) వంటి రంగాల్లో విప్లవాత్మక పథకాలు ప్రారంభించారని కొనియాడారు. వై.ఎస్. పాలన పథకాల ద్వారా లబ్ధి పొంది తమ జీవితాలను బాగుచేసుకున్న వారు తమకు అందిన ప్రయోజనాలను ఇతరులకు తెలియజేసేలా ప్రచారం కల్పించి ఆయనకు నివాళి అర్పించాలని సూచించారు. పరిచయమైన ప్రతి ఒక్కరితో అనుబంధం పెనవేసుకున్న వై.ఎస్. మనస్సున్న మారాజని వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో అన్నపురెడ్డి శివ, కోడూరు కృష్ణా రెడ్డి, భాస్కర్, వై.ఎస్.ఆర్, శ్రీకాంత్, వీరశివారెడ్డి, దర్గా నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.




