🕑 Published: October 04, 2026 at 06:02 PM CST
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్‌ఫ్రాన్సిస్కో(UCSF)కు డాక్టర్ శ్రీమన్నారాయణ అంబటి, రమ దంపతులు 1 మిలియన్ డాలర్ల (సుమారు రూ.10 కోట్లు) విలువైన ఎండోమెంట్ (శాశ్వత నిధి) విరాళాన్ని ప్రకటించారు. అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఫ్రెస్నో పట్టణంలో జరిగిన కార్యక్రమంలో విరాళాన్ని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు అందజేశారు. ఈ విరాళం సాన్ జోవాక్విన్ లోయలో వైద్య విద్య, పరిశోధనలను శాశ్వతంగా బలోపేతం చేసే లక్ష్యంతో ఇచ్చారు. అంబటి దంపతుల దాతృత్వ స్ఫూర్తి భావితరాలకు మార్గదర్శకం అవుతుందని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్‌ఫ్రాన్సిస్కో డీన్ డాక్టర్ జోస్ ఎమ్ భారల్ సాంచేజ్ అన్నారు.
ఈ సందర్భంగా డీన్ డా.సాంచేజ్ మాట్లాడుతూ.. ఆ దంపతులు ఇచ్చిన విరాళం ఎండోమెంట్ ఫండ్ కిందకు వస్తుందన్నారు. ఎండోమెంట్ నిధి శాశ్వత నిధి కింద జమవుతుందని.. దీనిలో ఉన్న 1 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా ఉంచి, దాని నుంచి వచ్చే వార్షిక ఆదాయాన్ని మాత్రమే ఖర్చు చేస్తారని తెలిపారు. ఏటా ఈ నిధి నుంచి విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఉన్న అత్యుత్తమ ప్రతిభ కలిగిన వైద్య విద్యార్థులకు, వారి ఆర్థిక అవసరాలకు సహాయం చేస్తారని వివరించారు. గ్రామీణ వైద్యం, అల్ట్రాసౌండ్ టెక్నాలజీ, కుటుంబ వైద్యం వంటి రంగాల్లో వినూత్న పరిశోధనలకు ఈ నిధులు ఉపయోగపడతాయన్నారు. దీనివల్ల భావితరాల వైద్య విద్యార్థుల పరిశోధనలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ఈ ఉదారమైన విరాళం UCSF చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. అంబటి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వైద్యులు, పరిశోధకులు. ఆయన సతీమణి రమ కూడా సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటున్నారని సాంచేజ్ తెలిపారు.
అనంతరం డాక్టర్ శ్రీమన్నారాయణ మాట్లాడుతూ... ‘‘మాతృభూమి భారత్‌తో పాటు నేను స్థిరపడిన అమెరికా రుణం తీర్చుకుంటాను. 1986 నుంచి అమెరికాలోని UCSFలో యూరాలజీ క్లినికల్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. మా కుటుంబం యూఎస్ఏలో 40 ఏళ్లుగా ఉంటోంది. UCSF మాకు గుర్తింపునిచ్చి నేను వైద్యుడిగా స్థిరపడటానికి అవకాశం కల్పించింది. నా సతీమణి రమ ప్రోత్సాహంతో మా సంపదలో కొంత భాగాన్ని తిరిగి ఈ సమాజానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాం’’ అని అన్నారు. ఈ నిధితో ఆర్థిక ఇబ్బందులు ఉన్న, ప్రతిభ కలిగిన విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ నిధి భవిష్యత్ తరాలకు కొనసాగుతుందన్నారు. దీనివల్ల ఎంతోమంది వైద్యరంగంలో సేవలందించేందుకు డాక్టర్లుగా తయారవుతారని పేర్కొన్నారు.

