🕑 Published: September 22, 2026 at 09:42 AM CST
తెలుగు అసోసియేషన్ ఆఫ్ జర్మనీ(TAG) ఆధ్వర్యంలో "తెలుగు సంబరం 2026" కార్యక్రమం ఫ్రాంక్‌ఫర్ట్‌లో నిర్వహించారు. జర్మనీ నలుమూలల నుంచి తెలుగు కుటుంబాలు, సాంస్కృతిక ప్రతినిధులు, విద్యార్థులు, ప్రముఖులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు వర్చువల్‌గా పాల్గొని మాట్లాడుతూ మిమ్మల్ని చూసి గర్వంగా ఉంది అని అన్నారు. తల్లిదండ్రులు, జన్మభూమి, మాతృభాష, మాతృదేశం, గురువు.. ఈ ఐదింటినీ జీవితంలో ఎప్పుడూ విస్మరించరాదని అన్నారు. జర్మనీ నలుమూలల నుంచి తెలుగు వారిని ఒక తాటిపైకి తెచ్చి, వారి సాంస్కృతిక అస్తిత్వాన్ని పరిరక్షించేందుకు తెలుగు అసోసియేషన్ ఆఫ్ జర్మనీ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు. కర్ణాటక సంగీత తరగతులు, తెలుగు–జర్మన్ పుస్తకాల ప్రచురణ, భాషా బోధన, సాంస్కృతిక కార్యక్రమాలు వంటి కార్యక్రమాలు భావితరాలకు తెలుగు వారసత్వాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని వెంకయ్యనాయుడు అన్నారు.
సంస్కృతి పరిరక్షణ కేవలం ఉత్సవాలకే పరిమితం కాకుండా, ప్రతి కుటుంబం మరియు ప్రతి వ్యక్తి నిరంతరం నిర్వర్తించాల్సిన బాధ్యతగా మారాలని ఆయన సూచించారు. భారత కాన్సులేట్ జనరల్ సుచిత కిషోర్, శాసనమండలి మాజీ సభ్యులు టీడీ జనార్దన్, నటుడు నిఖిల్ సిదార్థ, నెక్కంటి నిషాంత్ తదితరులు ప్రసంగించారు. కృష్ణ జవ్వాజి, రామ్ బొల్లా, మోహన్ జొన్నలగడ్డలకు విశిష్ట పురస్కారాలు అందచేశారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ జర్మనీ కార్యవర్గ సభ్యలు నరేష్ కోనేరు, సుమంత్ కోర్రపాటి, శ్రీకాంత్ కుడితిపూడి, శివ బత్తల, వంశీ దాసరి, వెంకట్ ఖండ్ర, దినేష్ కోవి, ఫర్హత్ మీర్జా, వంశీ ఉండవల్లి తదితరులు పాల్గొన్నారు



