🕑 Published: October 16, 2026 at 11:51 AM CST
ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ(APNRT) హ్యూస్టన్ చాప్టర్ ఆధ్వర్యంలో "Innovation – Invest in Andhra Pradesh" పేరుతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి (నార్త్ అమెరికా) శ్రీనివాస్ మిరియాలను సత్కరించారు. ఏపీఎన్ఆర్టీ సౌత్-వెస్ట్ కోఆర్డినేటర్ సాయి రాజ్ కొత్తమాసు, టెక్సాస్ స్టేట్ కోఆర్డినేటర్లు గోపాల్ గూడపాటి, రత్న ప్రసాద్ గుమ్మడి, రాజేష్ యాళ్ళబండి, హ్యూస్టన్ సిటీ కోఆర్డినేటర్ సురేష్ సత్తి ఈ కార్యక్రమాన్ని సమన్వయపరిచారు. పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మిరియాల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రణాళికలు, పెట్టుబడి అవకాశాలను వివరించారు. ‘వికసిత్ భారత్’ లక్ష్యానికి అనుగుణంగా రూపొందించిన ‘స్వర్ణాంధ్ర–2047’ ప్రణాళికతో పాటు, రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన తొమ్మిది అంశాలను ప్రస్తావించారు. అమరావతి రాజధాని, జల భద్రత, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, గ్లోబల్ లాజిస్టిక్స్, గ్రీన్ ఎనర్జీ, కృత్రిమ మేధస్సు, నైపుణ్యాభివృద్ధి, ఉత్పత్తుల నాణ్యత వంటి అంశాలను విపులీకరించారు. రెన్యూవబుల్ ఎనర్జీ, డేటా సెంటర్లు, సెమీకండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్, అంతరిక్షం, డ్రోన్లు, క్వాంటం టెక్నాలజీ, ఫార్మా, వైద్య పర్యాటకం, అరుదైన ఖనిజాలు తదితర రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. వట్టెం నరేంద్రబాబు భవిష్యత్ AI ప్రణాళికలపి ప్రసంగించారు. సమావేశంలో నిర్వహించిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాసాంధ్రులు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలనే తమ ఆసక్తిని వ్యక్తం చేశారు.



