హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌లో AI ఆధారిత సేవలు-నూతన కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్‌

Featured Image

హైదరాబాద్‌‌లో కాన్సుల్ జనరల్‌గా త్వరలో బాధ్యతలు చేపట్టనున్న అమెరికా ఉన్నతాధికారి లారా విలియమ్స్ గౌరవార్థం అమెరికాలోని భారత సంతతి ప్రముఖులు ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. యూఎస్ అమెరికా సాలిడారిటీ మిషన్ చైర్మన్, ఇండియన్ అమెరికన్ బిజినెస్ ఇంపాక్ట్ గ్రూప్ (IAMBIG) సహ వ్యవస్థాపకుడు రవి పులి సారథ్యంలో వర్జీనియాలోని టైసన్స్ కార్నర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. భారత సంతతి వ్యాపారవేత్తలు, టెక్నాలజీస్టులు, పాలసీ లీడర్స్, వివిధ మేధో, వాణిజ్య సంఘాలు ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో లారా విలియమ్స్ మాట్లాడుతూ భారత్-అమెరికా దౌత్య బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, బయోటెక్నాలజీ వంటి సాంకేతిక రంగాల్లో భారత్-అమెరికా భాగస్వామ్యంతో అవకాశాలు పెరుగుతాయని లారా విలియమ్స్ తెలిపారు. ప్రభుత్వం, వ్యాపారవర్గాలు, ఎండ్ యూజర్ల మధ్య పరస్పర విశ్వాసమే సైబర్ సెక్యూరిటీకి మూలమని వ్యాఖ్యానించారు. వీసాల జారీలో జాప్యంపై కూడా మిస్ లారా స్పందించారు. హైదరాబాద్ కాన్సులేట్ కార్యాలయంలో 54 వీసా విండోస్ అందుబాటులో ఉన్నా తగినంత సిబ్బంది లేరని అన్నారు. సిబ్బంది సంఖ్య పెంపుతో పాటు ఏఐ, ఆటోమేషన్ సహకారంతో కార్యకలాపాలను మరింత సులభతరం చేసేందుకు ప్రయత్నిస్తానని అన్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలలో అమెరికా వ్యాపారాల విస్తరణకు తాను కట్టుబడి ఉన్నానని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన రవిపై కూడా ప్రశంసలు కురిపించారు. ఆయన ఆతిథ్యం లభించడం గౌరవప్రదంగా భావిస్తున్నానని అన్నారు. మూడు రాష్ట్రాల వంటకాల రుచులను ఆస్వాదించానని కూడా అన్నారు. భారత్‌తో తనకు వ్యక్తిగత అనుబంధం కూడా ఉందని గుర్తు చేసుకున్నారు. 13 ఏళ్ల వయసులో భారత్‌కు వచ్చినప్పుడు హిందీ నేర్చుకునేందుకు ప్రయత్నించానని అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. మరోసారి భర్త, తనయుడితో కలిసి భారత్‌కు వెళ్లే అవకాశం లభించడంతో తన కల సాకారమైందని అన్నారు.

ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు రవి పులి మాట్లాడుతూ విలియమ్స్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించారు. భారత్, అమెరికాల మధ్య వారధిగా ఉన్న ఎన్నారైల ప్రాధాన్యాలను విలియమ్స్ అర్థం చేసుకున్నారని వ్యాఖ్యానించారు. అమెరికా దౌత్యపరంగా మెట్రో నగరాలకే పరిమితం కాకుండా టైర్-2 టౌన్‌లకు చేరువవ్వాలని ఆకాక్షించారు. భారత్‌లో విద్యనభ్యసించి అమెరికాలో ఉన్నతంగా ఎదిగిన తాము మాతృదేశ రుణం తీర్చుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ఈ దిశగా లారా విలియమ్స్ తన వంతు సహకారం అందించేందుకు సుముఖత వ్యక్తం చేయడం స్ఫూర్తివంతమని కామెంట్ చేశారు.

అనంతరం, కేక్ కటింగ్‌తో ఈ కార్యక్రమం ముగిసింది. వాషింగ్టన్‌లోని ఓ హైదరాబాదీ బేకరీ రూపొందించిన కేక్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇరు దేశాల సంస్కృతుల సమ్మేళనానికి చిహ్నంగా నిలిచింది. ఇక ఈ కార్యక్రమంలో సీఐఐ, ఎఫ్ఐ‌సీసీఐ, యూఎస్‌ఐబీసీ, భారత ఎంబసీ, ప్రాతీయ మేధో సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్ర, ఒడిశాల్లో వ్యాపారాలున్న వారు కూడా పాల్గొన్నారు.

Tags-Hyderabad USA Consul General Laura Williams Meet and Greet With NRIs in Washington DC By IAMBIG Ravi Puli

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles