🕑 Published: March 15, 2026 at 11:53 AM CST
ఓ మహా ప్రళయం తర్వాత, విష్ణుమూర్తి నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు ఉదయించిన చైత్ర శుద్ధ పాడ్యమినే సంవత్సరాదిగా, యుగాదిగా ప్రకటించింది బ్రహ్మపురాణం. కల్పాల లెక్కల నుంచి తిథులూ నక్షత్రాల నిర్ధారణ వరకూ భారతీయుల కాలగణన ఆద్యంతం ఆసక్తికరమే. సత్య, త్రేతా, ద్వాపర, కలి - నాలుగు యుగాలూ కలిస్తే ఓ మహాయుగం. 71 మహాయుగాలు.... ఒక మన్వంతరం. ఒక కల్పంలో మొత్తం 14 మన్వంతరాలు ఉంటాయి. ప్రస్తుతం నడుస్తున్నది... ఇరవై ఎనిమిదో మహాయుగం, ఏడో మన్వంతరం. సూర్యుడి కుమారుడైన వైవస్వత మనువు మనల్నిప్పుడు పాలిస్తున్నాడు. సూర్యవంశ స్థాపకుడైన ఇక్ష్వాకు మహారాజు ఇతని తనయుడే. మానవజాతికి మూలపురుషుడు కూడా వైవస్వత మనువే అంటారు. మనమిప్పుడు శ్వేతవరాహ కల్పంలో ఉన్నాం. హిరణ్యాక్షుడు భూమిని చాపచుట్టి, సముద్ర గర్భంలోకి తీసుకెళ్లినప్పుడు... సృష్టి యావత్తూ అతలాకుతలమైపోయింది.
ఆ సమయంలో శ్రీమన్నారాయణుడు శ్వేతవరాహ రూపంలో వెళ్లి... అసుర సంహారం చేశాడు. భూమిని భద్రంగా బయటికి తీసుకొచ్చాడు. ఈ మహత్కార్యం ప్రస్తుత కల్పంలోనే జరిగింది కాబట్టి, శ్వేతవరాహ కల్పం అనే పేరొచ్చింది. పూజలూ వ్రతాలూ సంధ్యాది విధుల్లో... ‘శ్వేతవరాహ కల్పే, వైవస్వత మన్వంతరే...’ అని సంకల్పం చెప్పుకోవడం ద్వారా సువిశాల సృష్టిలో మన ఉనికిని గుర్తుచేసుకుంటాం. అనంతమైన జగత్తులో మనం అణువంతే అన్న సత్యాన్ని గ్రహించుకుంటాం. ఆ మాటకొస్తే కూర్మ, వరాహ అవతారాలకు చాలా ముందే... మహావిష్ణువు మత్స్యమై అవతరించి, సోమకాసురుడి చెర నుంచి వేదాలకు విముక్తి కల్పించింది కూడా ఉగాది రోజేనని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడు చైత్ర శుద్ధ పాడ్యమినాడే... లంక నుంచి అయోధ్యకు తిరుగు ప్రయాణమైనట్టు వాల్మీకి రామాయణం చెబుతోంది. ఆ ప్రకారంగా చూస్తే, సత్య-త్రేతాయుగాలతో ముడిపడిన దసరా నవరాత్రుల కంటే, ద్వాపర నాటి దీపావళి కంటే... ఉగాదే అత్యంత ప్రాచీనమైన పండగ! బుద్ధిజీవిగా మారిన తర్వాత మనిషి జరుపుకున్న తొలి వేడుకా ఇదే కావచ్చు.



