టెక్సాస్‌లో...ఆర్థిక పాఠాలు ద్వారా సామాజిక సేవ చేస్తున్న శాన్వి గుళ్లపల్లి

Featured Image

డల్లాస్ పరిసర ప్రాంతమైన సౌత్‌లేక్‌కు చెందిన ఏలూరు ప్రవాసాంధ్ర బాలిక గుళ్లపల్లి శాన్వికి ఆర్థిక అంశాలపై చిన్నప్పటి నుండి ఆసక్తి ఎక్కువ. తన అభిరుచి ద్వారా నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆర్థిక పాఠాల ద్వారా అమెరికా పిల్లలకు బోధిస్తూ తద్వారా వచ్చిన సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్న ఎనిమిదో తరగతి విద్యార్థిని శాన్విపై ప్రత్యేక కథనం.

శాన్వి తండ్రి గుళ్లపల్లి రవి ఫాస్ట్రా ఇన్వెస్ట్‌మెంట్స్ సంస్థకు సీఈవోగా ఉన్నారు. చిన్ననాటి నుంచే తండ్రితో కలిసి టీవీలో బిజినెస్ వార్తలు చూడడం, పత్రికల్లో ఫైనాన్స్ కాలమ్స్ చదవడం ద్వారా శాన్వికి డబ్బు, పెట్టుబడులు, స్టాక్‌మార్కెట్ వంటి విషయాలపై మక్కువ కలిగింది. ఆరేళ్ల వయస్సులో అమెరికాలో ప్రముఖ బిజినెస్ ఛానల్ CNBCకు వీడియో ప్రశ్న పంపడం ద్వారా ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు స్కాట్ వాప్నర్ దృష్టిలో పడిన శాన్వి ఆయన సహకారంతో 2023లో CNBC Halftime Report కార్యక్రమంలో పాల్గొనడమే గాక న్యూయార్క్ స్టాక్ ఎక్స్‌ఛేంజి సందర్శించి క్లోజింగ్ బెల్ చూడగలిగే అవకాశాన్ని సంపాదించింది. ఇవి ఆర్థిక రంగంపై శాన్విలోని ఆసక్తిని మరింతగా పెంచాయి.

అమెరికా, భారతదేశం వంటి దేశాల విద్యా వ్యవస్థల్లో ఆర్థిక అవగాహన, ద్రవ్యోల్బణం, పెట్టుబడులు వంటి అంశాలపై ప్రాథమిక విద్య చాలా తక్కువగా ఉండటాన్ని గమనించిన ఆమె 2025లో 'శాన్వి ఫైనన్స్ అకాడమీ' అనే లాభాపేక్షలేని సంస్థను ప్రారంభించి అమెరికా సహా పలు దేశాల విద్యార్థులకు ఆర్థిక విద్య అందిస్తోంది. ఎనిమిదో తరగతి చదువుతున్న శాన్వి ఐదో తరగతి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రత్యేకంగా రూపొందించిన పది వారాల కోర్సు ద్వారా ప్రతి శనివారం ఆర్థిక పాఠాలు బోధిస్తోంది. ఆదాయం, ఖర్చులు, పెట్టుబడులు, రిస్క్ వంటి అంశాలను పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా వివరించేందుకు ప్రత్యేకంగా ముద్రించిన పాఠ్యసామగ్రిని కూడా ఈ కోర్సులో భాగంగా తానే సిద్ధం చేసి అందజేసింది. 2025లో సౌత్‌లేక్ నగరంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా సుమారు 20 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కోర్సు ద్వారా లభించిన ₹2లక్షల70వేలు ($3వేలు) మొత్తాన్ని ఇర్వింగ్‌లోని సాల్వేషన్ ఆర్మీ సేవా సంస్థకు విరాళంగా అందించింది. ఆమె ప్రయత్నాన్ని అభినందిస్తూ సౌత్‌లేక్ నగర మేయర్, సిటీ కౌన్సిల్ సభ్యులు ప్రత్యేకంగా సత్కరించారు. జనవరి 6వ తేదీని సౌత్‌లేక్‌లో శాన్వి గుళ్లపల్లి డేగా ప్రకటించారు.

ప్రస్తుతం శాన్వి టెక్సాస్‌లోని ఫ్రిస్కో నగరంలో కూడా తన కోర్సును నిర్వహిస్తోంది. మూడు వారాల క్రితం అక్కడ ప్రారంభించిన తరగతుల్లో ఇప్పటికే 23 మంది విద్యార్థులు చేరారు. ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటికే ₹4లక్షల50వేలు ($5వేలు) నిధులు సంకూరాయని వాటిని త్వరలోనే ఒక సేవా సంస్థకు విరాళంగా ఇస్తానని శాన్వి తెలిపింది. అమెరికాలోని కాలిఫోర్నియా, ఓహాయో, జార్జియా రాష్ట్రాల నుంచి..భారత్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి కూడా విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా తన కోర్సులో చేరేందుకు 18మంది రిజిస్టర్ చేసుకున్నారని ఈ సందర్భంగా తెలిపింది.

పిల్లల్లో ఆర్థిక అవగాహన పెంపొందించడం తన ప్రధాన లక్ష్యమని శాన్వి చెబుతోంది. భవిష్యత్తులో మరిన్ని నగరాలకు తన కార్యక్రమాలను విస్తరించి, ఎక్కువ మంది విద్యార్థులకు ఫైనాన్షియల్ లిటరసీ అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతోంది. మరిన్ని వివరాలకు www.saanvifinanceacademy.com/ చూడవచ్చు.

Tags-Saanvi Gullapalli of Southlake Teaching Financial Literacy Classes

Gallery

JOIN OUR WHATSAPP CHANNEL FOR MORE UPDATES

Featured Content

Latest Articles