🕑 Published: March 27, 2026 at 06:41 PM CST
ఏపీని గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా ఆంధ్రలో పెట్టుబడులు పెట్టాలని ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహనకృష్ణ కోరారు. న్యూజెర్సీలో ప్రవాసాంధ్ర ఐటీ పారిశ్రామికవేత్తలతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగంలో వేగంగా అడుగులు వేస్తుందని రాష్ట్రంలో ఐటీ విప్లవ ప్రభంజనం సాగుతోందని వివరించారు. హైదరాబాద్‌ను ఐటీ మ్యాప్‌లో నిలబెట్టినట్లుగానే, ఇప్పుడు ఏపీని టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ ప్రయత్నానికి సహకరించి భాగస్వాములు కావాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలు, రాజధాని అమరావతిలో రాబోతున్న ప్రతిష్ఠాత్మక 'క్వాంటం వ్యాలీ' ప్రాజెక్టుల గురించి ఆయన వివరించారు. అమరావతిని ప్రపంచ స్థాయి ఐటీ, రీసెర్చ్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతిక సౌకర్యాల వల్ల ఐటీ కంపెనీలకు ఏపీ అద్భుతమైన వేదిక అవుతుందని పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఏపీలో కంపెనీలు ఏర్పాటు చేస్తే రాష్ట్ర యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు. అనుమతులు, మౌలిక సదుపాయాలను ప్రభుత్వం తరపున APTS సమకూరుస్తామని మోహనకృష్ణ భరోసా ఇచ్చారు. ఆయన విజ్ఞప్తికి ఐటీ పారిశ్రామికవేత్తలు సానుకూలంగా స్పందించారు.





