🕑 Published: March 28, 2026 at 07:18 PM CST
ఫెడరేషన్ ఆఫ్ ఎన్నారై కల్చరల్ అసోసియేషన్స్-మలేషియా ఆధ్వర్యంలో బ్రిక్ ఫీల్డ్స్ లోని కృష్ణ ఆలయంలోని బ్రిందావన్ హాల్‌లో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. అద్భుతమైన అలంకరణతో అతిథులను ఆకట్టుకుంది. వేద-ఆగమ సంప్రదాయం ప్రకారం అర్చకుల మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారి వివాహ క్రతువు కన్నులపండువగా సాగింది.
భారతదేశం నుండి మలేషియాకు ప్రత్యేకంగా తీసుకువచ్చిన శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు, హనుమంతుడు విగ్రహాలకు ముందుగా పల్లకి సేవ నిర్వహించి, నాదస్వర వాద్యాలతో ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించారు. రామనామ సంకీర్తనలు, కోలాటం, పిల్లల ఆటపాటలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సీతారాముల కళ్యాణం అనంతరం భోజన ప్రసాదం అందజేశారు.
సంస్థ అధ్యక్షుడు బురెడ్డి మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ మహోత్సవం మలేషియాలో ఉంటున్న తెలుగు ప్రవాసులను ఒకే తాటిపైకి తెచ్చిందని ఇది ప్రతి సంవత్సరం జరిగే సంప్రదాయంగా మారేందుకు మార్గం సుగమం చేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. పూజారి రాకేష్ శర్మకి సన్మానం చేసి జ్ఞాపికను అందజేశారు.
ఈ కార్యక్రమంలో సహాధ్యక్షుడు కృష్ణ ముత్తినేని, ఉపాధ్యక్షుడు రవివర్మ కనుమూరి, ప్రధాన కార్యదర్శి శివ సానిక, సంయుక్త కార్యదర్శి భాస్కర్ రావు ఉప్పుగంటి, కోశాధికారి రాజశేఖరరావు గునుగంటి, యువజన విభాగం అధ్యక్షుడు క్రాంతికుమార్ గాజుల, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు సాయికృష్ణ జులూరి, మహిళా విభాగం అధ్యక్షురాలు శిరీష ఉప్పుగంటి, మహిళా ఉపాధ్యక్షురాలు దుర్గాప్రవళికరాణి కనుమూరి, కార్యనిర్వాహక సభ్యులు నాగరాజు కాలేరు, నాగార్జున దేవవరపు, ఫణీంద్ర కనుగంటి, సురేష్ రెడ్డి మందడి, విజయ్ కుమార్ మాడిశెట్టి, మంగపతి, సతీష్ రావు, సందీప్, రవితేజ శ్రీదాస్యాం, సూర్యకుమారి, రజిని తదితరులు పాల్గొన్నారు.











