🕑 Published: March 27, 2026 at 07:05 PM CST
14వ వార్షిక అమెరికా కాంగ్రెస్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో చికాగోకు చెందిన శ్వేత కొత్తపల్లి ఎన్.టీ.ఆర్ పురస్కారం అందుకున్నారు. అమెరికన్ మల్టీ ఎథ్నిక్ కమిషన్(AMEC) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఆమెకు ఈ అవార్డు ప్రదానం చేశారు. అమెరికా కాంగ్రెస్ సభ్యుడు డ్యానీ కె. డేవిస్ ఆతిథ్యంలో గురువారం నాడు వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
2009లో స్థాపించబడిన AMEC ఈ పురస్కారాలను 2023 నుండి ప్రదానం చేయడం ప్రారంభించింది. సమానత్వం, మహిళ సాధికారత కోసం కృషి చేస్తున్న వ్యక్తులను ప్రోత్సహించడానికి ఈ అవార్డులను అందిస్తోంది. శ్వేత కొత్తపల్లి కలాష్ కాస్ట్యూమ్స్ సంస్థ సీఈఓగా సేవలందిస్తూ వ్యాపార రంగంలో విశేష కృషి చేస్తున్నారు. ఆమెను గ్లోబల్-అమెరికన్ వీక్లీ పోడ్కాస్ట్ హోస్ట్ డాక్టర్ విజయ్ జి. ప్రభాకర్ ఈ గౌరవానికి నామినేట్ చేశారు. ఈ కార్యక్రమంలో అమెరికా సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులు అభినందనలు తెలిపారు.




